Vidura Niti—Life Principles Still Relevant: Part- 3
Vidura Niti—Life Principles Still Relevant today: Are you associating with deception…? మోసంతో సహవాసం చేస్తున్నావా…? సుఖదుఃఖ కారణాలు…అల్పబుద్ధి
కచ్చి దేతైర్మహాదోషై ర స్పృష్టోసి నరాధిప, కచ్చిచ్చ పర విత్తేషు గృధ్య న్న పరితప్యసే!
రాజా! పెనుదోషములు నిన్నంటలేదు కదా… ఇతరుల సొమ్ములందు లోభపడి నీవు తపించుటలేదు కదా… అంటూ ప్రశ్నిస్తున్నాడు Vidura ధృతరాష్ట్రుని.
Dhritarastra విదురుని పిలిపించుకొని తనకు నిద్రపట్టడం లేదని నాలుగు ఉపశమన వాక్యాలు చెప్పమని అడుగుతాడు. దానికి బదులిస్తూ “బలవంతుడు దండయాత్రకు వచ్చిన వేళ సాధన సంపత్తి లేని వానికి, సొమ్ము కోల్పోయిన వానికి, కాముకునికి, పరుల సొమ్ము దోచుకోవాలనే భావన కలిగిన దొంగలకు నిద్రపట్టదని చెపుతూ Vidura పై మాటలు చెపుతాడు.
వ్యక్తి ధర్మమార్గాన్ని తప్పిన వేళ తనకు దోషములు అంటడం సంభవిస్తుంది… అంటే… జీవితంలో ఏదో చెడు ఆలోచన రూపుదాల్చినట్లే. అదే చెపుతున్నాడు Vidura
నిజాయతీ వేరు సమగ్రత వేరు. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిని ఒక ప్రశ్న వేశాడు. నీవు దారివెంట వెళుతూ ఉంటే ఒక పర్స్ దొరికింది. ఏం చేస్తావు అని అడిగాడు. పిల్లవాడు పర్స్ తీసి జేబులో పెట్టుకుంటానన్నాడు. అది ఆ పిల్లవాని నిజాయితీని తెలుపుతుందే కాని తనది కాని దానిని తనదిగా స్వంతం చేసుకోవాలనుకోవడం సమగ్రతకు విరుద్ధంగా తలవాలి.
నిజానికి ధృతరాష్ట్రుని లో లోపించినది ఆ సమగ్రతయే. అందుకే మనసులో వ్యగ్రత. ఆ వ్యగ్రత నిద్దురలేకుండా చేసింది. రెండు వర్గాలకు… కౌరవ పాండవులకు నాయకుడు ధృతరాష్ట్రుడే. పుత్రవాత్సల్యం ముందు, రాజ్యలోభం ముందు సత్యాన్ని చెప్పే ధైర్యం, ధర్మాన్ని ఆచరించే నిష్ఠ లోపించింది. అలాగని అధర్మ నడకతో వచ్చే పర్యవసానాలను, పరిణామాలను ఎదుర్కొనే మానసిక సన్నద్ధత లేదు. అతని మనసు నిండా రాజ్యాన్ని అనుభవించాలనే “ఆశ” నిండిపోయింది. తన దార్శనికత “నాకు-నా వారికి ఏమి వస్తుందనే” భావనను మాత్రమే దర్శిస్తున్నది. అధర్మ వర్తనులు, అపరాధులు అయిన తన సంతానాన్ని రక్షించడం, నిరపరాధులు, ధర్మవర్తనులైన పాండవులను దండించడంపైనే అతని దృష్టి కేంద్రీకృతమయింది.

తాను పాండవులను పిలిచి అర్ధరాజ్యమో కొంత రాజ్యమో ఇస్తే సమస్య తీరిపోతుంది. కాని ఆ పరిష్కార విధానంపై ఆతని దృష్టి నిలవడం లేదు… అంతటా సమస్యలనే చూస్తున్నాడు. క్షాత్రాన్ని చూపడంలో ఎన్నోమార్లు అపజయాన్ని చవిచూసిన అసమర్ధులైన కర్ణాదుల సహచర్యంతో గర్విస్తున్న అనర్హుడై దుర్యోధనుని అందలమెక్కించేందుకు ఎంతటి రక్తపాతాన్ని సృష్టించేందుకైనా సిద్ధపడ్డాడు. అందుకే అతని మనసులో గజిబిజి, గందరగోళం నెలకొన్నాయి. ఆ వ్యగ్రత నిద్దుర రానీయడం లేదు.
ఒక నాయకుడు యధార్ధానికి అనుయాయుల ఎదుగుదలలో ఉత్ప్రేరకంగా పని చేయాలి. ప్రేరణగా నిలవాలి. సమన్వయతను సాధించాలి. కాని Dhritarastra దానికి భిన్నంగా నేను, నా వారు… వారు పరవారనే భావనతో అనవసర వైరుధ్యాన్ని ఆహ్వానిస్తున్నాడు. సమర్ధురాలైన ఒక తల్లి పెంపకంలో ధైర్య మనస్కులై పెరిగిన సంతానం ఆమె మరణం తదుపరి ఆమె “జ్ఞాపకాలతో” కాదు ఆమె “ఉనికిని” అనుభవిస్తూ జీవిస్తారు. అలాగే సమర్ధుడైన నాయకుడు కూడా తన అనుయాయులను తయారు చేయాలి. ఆ విజ్ఞత ధృతరాష్ట్రునిలో లోపించింది.
రెండు వర్గాలు తన క్రింద పనిచేస్తే తన సామ్రాజ్యం బలోపేతమౌతుంది. అది ఉదాత్తమైన ఆలోచన… కాని ఆచరణాత్మకం కాలేదు. ఎంత గొప్ప ఆలోచనయైనా దానిని ఆచరణలో పెట్టకపోతే అది మరణిస్తుంది. మనం ఉపయోగించని గొప్ప భావనలు కదలిక లేకుండాపోతాయి… చివరకు కాలాతీతమైన వాటిని మనం వదలుకోవలసివస్తుంది. ఆ సమన్వయ విధానాన్ని ధృతరాష్ట్రుని మనస్సు అనుమోదించడం లేదు. సమయానికి తన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించడమే విజ్ఞతాభరితమైన జ్ఞానం… ఆ ఇంగితజ్ఞానం లోపించింది కాబట్టే నిరాశానిస్పృహలతో సహవాసం చేస్తున్నాడు… అంటాడు Vidura
Reasons for happiness and sadness… సుఖదుఃఖ కారణాలు…
శ్రోతు మిచ్చామి తే ధర్మ్యం పరం నైః శ్రేయసం వచః అస్మిన్ రాజర్షి వంశే హి త్వమేకః ప్రాజ్ఞ సంమతః!
విదురా! రాజర్షి వంశమున నీవు ఒక్కడివే సర్వధర్మములు చక్కగా నేర్చిన వాడివి. కాబట్టి పండితులు నీవు చెప్పిన దానిని సమ్మతింతురు. నా మనసు అస్థిరతతో సతమతమవుతూ ఉన్నది. అది ప్రశాంతతను పొందే విధంగా ధర్మముతో గూడినదియు, మిక్కిలి శుభములు ఇచ్చునదియునగు పలుకులు నీ నుండి వినగోరుచున్నాను అంటాడు Dhritarastra.
దానికి Vidura… రాజా…! మానవుని సుఖదుఃఖాలకు దేశకాలాలు కారణమౌతాయి. ఆత్మబలమే వాటికి అతీతంగా స్పందించగలుగుతుంది. ఆత్మబలానికి రెండు పార్శ్వాలుంటాయి. ఒకటి జీవితంలో అత్యున్నత లక్ష్యాలు సాధించగలననే బలమైన సంకల్పం కాగా రెండవది ఆ లక్ష్యాన్ని సాధించగలననే నమ్మకంతో బలోపేతమైన, సాధకుని దారిలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే సామర్ధ్యం.
నిస్సారంగా, సామాన్యంగా, నిరాసక్తంగా మారిన జీవితం ఆసక్తి దాయకంగా, సార్ధకమైన జీవితంగా మారాలి అంటే… మానవుల వివిధ నైపుణ్యాలు, విభిన్న సమర్ధతలు, దృక్పథాలు, మానసిక ప్రవృత్తులు సమన్వయం కావాలి. అలా సమన్వయపరచగలిగిన నాయకత్వం కావాలి. ఆ నాయకుని వ్యక్తిత్వం సమాజంలో తాను ఉత్తమ వ్యక్తిగా గుర్తింపబడేందుకు అనువుగా తీర్చిదిద్దబడాలి. ఇంటికి పెద్దగా రెండు వర్గాలనూ సమన్వయపరచవలసిన నీవు పుత్రవాత్సల్యంతో మంచి లక్షణాలు గలిగిన పాండవులను అరణ్యానికి పంపినావు. మంచిచెడ్డలు తెలియని అహంభావులైన దుర్యోధనాదులకు ప్రభుత్వాన్ని నడిపే అధికారాన్ని అప్పగించావు. ధర్మరాజు ముల్లోకాలకు ప్రభువు కాదగిన లక్షణాలు కలిగినవాడు. అయినా వారు నీవు పెట్టిన అన్ని కష్టాలు భరించారు.. అంటాడు Vidura
రాజా! పుస్తకం చదువుతూ ఉంటే… అక్షరాలు అయిపోవచ్చు కాని చదివిన పుస్తకం యొక్క భావము అర్థము మాత్రమూ మనసులో మిగిలే ఉంటాయి. వ్యక్తిలో సంఘర్షణకు అది ఉత్ప్రేరకంగా పనిచేస్తూనే ఉంటుంది. నీవు పెట్టిన బాధలు పాండవుల మనసులలో అంత త్వరగా చెదరిపోవు… అలాగే వారు అరణ్యవాస సమయంలో సాధించిన అస్త్రశస్త్ర సాధన సామాగ్రి నీ మనసును కలతపెడుతూ ఉన్నది. కాబట్టే నీలో ఆ సంఘర్షణ. అరణ్యంలో ఉన్నందుకు పాండవులూ, సంఘర్షణతో, సందిగ్ధతతో, భయం గుప్పిట్లో హస్తినలో నీవూ ఇరువురూ ఒకే విధమైన బాధలలో ఉన్నారు. మంచు పూర్తిగా కప్పివేసిన సమయంలో సూర్యుడు, చంద్రుడు సమానంగా కనిపించిన విధంగానే వ్యథచే బాధపడేవారు ఎంత గొప్పవారయినా, చిన్నవారయినా ఒకే విధంగా కనిపిస్తారు.
అధికులు అల్పులనే భేదం సుఖాలలో కనిపిస్తుందే కాని బాధతో ఉన్నప్పుడు కనిపించదు. రాజా! నేను చెప్పే అంశాలేవీ ప్రజ్ఞాచక్షువువు అయిన నీకు తెలియనివి కావు. | ఒక్కసారి భారతీయ జీవన విధానం యొక్క సమగ్రతా దృష్టిని పరిశీలించు. అందులో ప్రశ్నించే విధానం, సమాధానం చెప్పే విధానం; ఎదుటివారి కోణంలో ఆలోచించే విధానం, సమస్యలు కేంద్రంగా కాక, పరిష్కారాలు కేంద్రంగా ఆలోచించే విధానం, పరిస్థితులను సమన్వయపరచుకునే విధానం ఇవన్నీ ఉత్తమ జీవనగతులకు మార్గం చూపుతూ… ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు సహకరిస్తున్నాయి.. అంటాడు Vidura.
ఎంత గొప్ప వ్యక్తియైనా, ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా తాను అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు అంతరంగంలో నిబిడీకృతమై ఉన్నాయి. నిజానికి మానసిక శారీరక సామర్థ్యాలు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే పనిచేస్తాయి. అయితే వాటి వినియోగం హెచ్చిన కొద్దీ వాటి ఉత్పాదనా సామర్ధ్యం ద్విగుణీకృతం అవుతుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలు వినియోగానికి సరైన నిష్పత్తిలోనే ఉత్పత్తి చేసినట్లుగా వ్యక్తి మానసిక శక్తీ వినియోగించినంత మేరకే వెలుగు చూస్తుంది. అనంతమైన శక్తి సామర్ధ్యాలను సద్వినియోగం చేసుకోవడంలోనే వ్యక్తి పరిణతి ఆధారపడి ఉంటుంది. వేడుక వ్యసనంగా మారిన ధర్మరాజు జూదంలో సర్వస్వాన్ని ఓడాడు. వ్యసనపరతలో శక్తి తక్కువయితే దానిపై రక్తి పెరుగుతుంది. అసమర్ధత లాలసతను పెంచితే వ్యసనశీలత అంతకంతకు పెరిగి ఉన్నదంతా పోగొట్టుకుంటుంది. లోభపీడితుడైన దుర్యోధనుడు కాలావధి పిమ్మట రాజ్యాన్ని అప్పగించేందుకు ఇష్టపడటం లేదు. ఇరువర్గాలను సరి చేయవలసిన అధికారం పుత్రవాత్సల్యంతో గ్రుడ్డిదయింది.. అంటాడు Vidura.
రాజా! రామాయణంలో కబంధుడనే రాక్షసుడు పూర్వం ఒక గంధర్వుడు. అహంభావం కారణంగా మనిషి స్థాయికి దిగాడు. తాను సాధించిన విజయాలు అతని గర్వాన్ని పెంచగా గర్వమతియై రాక్షసుడయ్యాడు. తదుపరి అతని పశ్చాత్తాపం అతనిని మనిషి స్థాయికి ఎదిగేందుకు సాయపడింది. శ్రీరామునికి సాయపడటం వల్ల తిరిగి గంధర్వుడయ్యాడు. నీకు ప్రశాంతత కావాలి అంటే పాండవులను పిలిచి వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి అందరూ సుఖంగా ఉండటమే.. అంటాడు Vidura.
అల్పబుద్ధి… Ignorance… క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీ స్తంభో మాన్య మానితాయమర్థాన్నప కర్షంతి స వై పందిత ఉచ్యతే!
కోపము, సుబ్బును, గర్వము, నాపోవక యునికియును, దురభిమానము, ని ర్వ్యాపారత్వము ననునివి కాపురుష గుణములండ్రు కౌరవనాథా!(తిక్కన-మహాభారతం-ఉద్యోగపర్వం)
విదురుని ముఖంగా కుత్సిత మనస్సు గలవాని (కాపురుషుని) లక్షణాలను చెపుతున్నాడు తిక్కనగారు. మితిమీరిన కోపము, ఉబ్బు (అతిగా పొంగిపోవుట), గర్వము, మిడిసిపాటు, సంతృప్తిలేకపోవడం, దురభిమానం, సిగ్గులేకుండుట, తన్ను తాను పూజ్యుడనుకొనుట, ఏ పని చేయకుండుట… ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎలా నష్టపోతాడో సార్వకాలికం చేస్తున్నాడు విదురుడు.
కోపం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు కోల్పోవడం జరుగుతుంది. అతిగా పొంగిపోవడం వల్ల యదార్థాన్ని గ్రహించలేము. గర్వము వల్ల కుటుంబంతోసహా అందరూ దూరమౌతారు. సంతృప్తిలేకపోవడంవల్ల అశాంతి, అశాంతి వల్ల వేదన కలుగుతుంది. దురభిమానం వల్ల ఏకాకి జీవనం ప్రాప్తమౌతుంది. నిర్వ్యాపారత వల్ల బద్ధకం… గౌరవ హాని కలుగుతుంది. జీవితం స్తబ్ధమౌతుంది.. వీటి సమష్టి ఫలితంగా అపజయం పాలవుతాము.
ప్రతి వ్యక్తిలో మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. అయితే ఏ లక్షణాలు మన ఉన్నతికి ఉపయుక్తాలో గ్రహించి వాటిని ఆదరించడం, ప్రతిబంధకాలుగా ఉన్న వాటిని అదుపులో పెట్టుకోవడంవల్ల వ్యక్తిలో జాత్యంతరీకరణ (స్థాయి ఉన్నతీకరణ) జరుగుతుంది. సల్లక్షణాలు విజయాన్నిస్తే… చెడుగా తలచే లక్షణాలు అపజయాన్ని ఇస్తాయి. నిజానికి “అపజయం”లో ఉన్నది జయమే. “అప” అనే ఉపసర్గ చేరడం ద్వారా అపజయం అవుతుందనే సత్యాన్ని గుర్తిస్తే ఆ “అప”ను విడవడం సాధ్యపడుతుంది.
మనసుకు నచ్చని వ్యక్తి లేదా సన్నివేశంపై మన అసంతృప్తిని ప్రదర్శించే విధానమే కోపం. కోపం మనలోని భావోద్వేగములకు ప్రతీక. కోపం రావడం మంచిదే కాని అది క్రోధంగా మారకూడదు.
ఒక నది రెండు దరుల మధ్య ప్రవహిస్తే అందంగా ఉంటుంది. అదే నది పొంగిపోతూ పరిసరాలను ముంచెత్తితే… భయంకరంగా కనిపిస్తుంటుంది. పొంగు శాశ్వతం కాదు. వరదనీటి ప్రవాహం ఉన్నంత వరకే దాని ఉద్ధృతి. పొంగులో నది తన సహజత్వాన్ని కోల్పోతుంది. పొంగు యొక్క పరిణామాలు తదుపరి కాలంపై భయంకరమైన ముద్రలను వేస్తాయి. అలాగే అవాంతరంగా పెరిగిన సంపదతో పొంగిపోయి అతిశయాన్ని ప్రదర్శించే వ్యక్తులు దానిని నిలుపుకోలేక క్రుంగిపోతే చివర ఎండిపోయిన నదిలా కృశించిపోక తప్పదు. వారి గౌరవమూ నిలువదు.
గడ్డిపరకను మండిస్తే ఎంత సమయం ఉంటుందో అంత సమయమే కోపం ఉండాలట. క్రోధంగా మారిన కోపం అసహనాన్ని ఇస్తుంది. అసహనం ద్వారా ఒత్తిడి, ఒత్తిడిని తట్టుకునేందుకు మనలో జరిగే సంఘర్షణ వల్ల అసంతృప్తి కలుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దగలిగిన నైపుణ్యం మనలో కరవయినప్పుడు మనలోని అసంతృప్తిని బహిర్గతం చేయడం వల్ల కలిగేది అపజయం. పరిధిని దాటి పొంగిపోవడం ఉబ్బుగా చెప్పుకోవాలి. పొంగిపోవడం వల్ల అతిశయం పెరుగుతుంది.

ఒక సంస్థ విజయానికి కారణాలు ఎన్నో… ఎందరి సమష్టి కృషియో కారణమౌతుంది. ఎందరి శక్తియుక్తులు ధారపోస్తేనో సంస్థ విజయాన్ని నమోదు చేసుకోగలుగుతుంది. అందరి భాగస్వామ్యంతో సమష్టితత్త్వంతో సాధించిన విజయంలో నాయకుడు ముఖ్యభూమిక వహిస్తాడు. అయితే ఆ విజయంతో నాయకుడు అది తన గొప్పదనమనుకొని గర్వపడితే, సంస్థలో “నేనే” అనుకుంటే ఫలితాలు మరునిమిషమే తారుమారు అయ్యే ప్రమాదం ఉన్నది. ఒక్కొక్కమారు సంస్థలోని ఒక చిన్న ఉద్యోగి ఆలోచన అనూహ్యమైన విజయాన్ని చేకూర్చవచ్చు. అంతమాత్రాన “నేనే” అనే ఆధిక్య భావనను పొందితే, గర్వం తలకెక్కి తన ప్రయాణం సమష్టి నుండి వ్యష్ఠికి మారితే అపజయం నేనున్నానని పలకరిస్తుంది. “అందరి”లో నుండి “మనం” వేరు పడటం ఎప్పుడైనా ప్రమాదమే. అందువల్ల గర్వము పనికిరాదు.
వ్యక్తి జీవితానికి సంతృప్తి, విజయం అనేవి రెండూ… రెండు రెక్కల వంటివి. ఒకటి లేనినాడు రెండవది ఉపయోగపడదు. విజయ సాధకులందరూ సంతృప్తిగా ఉండకపోవచ్చు. కాని సంతృప్తి కలిగిన వ్యక్తులు మాత్రం విజయసాధకులౌతారు. అయితే తృప్తి నిర్లిప్తతను ప్రసాదిస్తే ప్రగతి కుంటుపడుతుంది. అదే సంతృప్తి మరియొక విజయానికి దారి చూపితే లేదా ప్రేరణనందిస్తే అది ఆశయ సాధనకు మూలమవుతుంది. సంతృప్తి లేకపోవడం “ఆశ”గా సంతృప్తిపడటం “ఆశయం”గా చెప్పుకుంటాము. ఆశలో పరపీడన ఉంటుంది…. ఆశయం సాధన అంతర్లీనంగా ఉంటాయి. కాబట్టి సంతృప్తిపడటం విజయసాధనలో భాగంగా చెప్పుకోవాలి.. కాకపోతే ఆ సంతృప్తి మరొక మెట్టునెక్కేందుకు దారి చూపాలి.
స్వాభిమానం లేని బ్రతుకు నిస్సారమైనది. అభిమానం కలిగిన వాడు ఏదైనా సాధించాలనే తపనలో రగలిపోతాడు. అభిమానవంతుడు పట్టువిడుపులు కలిగి ఉంటాడు. అభిమానం అహంకారానికి ఆశ్రయం ఇస్తే అది దురభిమానం అవుతుంది. దానివల్ల వ్యక్తి ప్రతిష్ట దెబ్బతింటుంది. ఫలితం ఒత్తిడికి గురై అపజయాన్ని పొందుతాడు. అదే అభిమానం అణుకువను ప్రదర్శిస్తే ప్రగతికి మార్గం చూపుతుంది. దురభిమానం ప్రదర్శిస్తే దురవస్థను పొందక తప్పదు. మిడిసిపాటు, తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల సమాజం నుండి దూరంగా జరుగుతాము. జీవితం నిరంతర సాధనాపర్వం. సాధన “వ్యాపారం” ప్రాతిపదికగా నడుస్తుంది.
వ్యాపారం అంటే పని లేదా వృత్తి. నిర్వ్యాపారత అంటే ఏ పని చేయకుండా వృథా గా కాలం గడపడం. గడచిన ప్రతిక్షణం మన జీవితంలో ఒక క్షణాన్ని హరిస్తుంది. మనుష్య జన్మ అంటేనే ఏదైనా సాధించేందుకు ఉద్దేశింపబడింది. మానవ”లోనే క్రొత్తదనం (నవ) ఉన్నది. క్రొత్తదనాన్ని ఆవిష్కరించలేని మానవ జీవితానికి అర్థంలేదు. అయితే ఏదైనా సాధించాలి అంటే కృషి కావాలి. తపన కావాలి, పట్టుదల కావాలి… అపరిమితమైన కోరిక అంతరంతరాలలో రగిలిపోవాలి. అప్పుడే మన గమ్యం గమనం స్పష్టమై… మనలనావైపు నడిపిస్తాయి. అలాకాక ఏ పనినీ చేయనట్టి వారి బ్రతుకులు నిస్సారమై బండరాయిలా అర్ధం పరమార్ధం లేకుండా మారుతాయి. అందువల్ల జీవించి ఉన్నంత వరకూ ఏదో పనిని చేయాలని విదురుడు చెపుతున్నాడు.
Don’t just say: అప్పుడే చెప్పొద్దు: యస్య కృతం న జానంతి మంత్రం వా మాత్రితం పఠే కృతమేవాస్య జానంతి సవై పండిత ఉచ్యతే!
అతడేమి చేయునో ఎవ్వరు ఎరుగరు. చేసిన ఊహయోమో తెలియరాదు.. ముగిసిన పనిని మాత్రమే ఇతరులెరుగుదురు. అట్టివానినే పండితుడు అంటారు.
అయితే చేసే పనిని ఆలోచనలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడం వల్ల ఇతరులు ఆ పనికి అవరోధాలు కలిగించే అవకాశం ఉంటుంది. కొందరు తమకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఇతరుల కార్యాన్ని భగ్నం కావించి ఆనందించే పైశాచిక మనస్తత్వంతో ఉంటారు. అలాంటి వారినే “వృథాన్యార్థ భంగము కావించెడి వారిగా” శతకకారుడు చెప్పాడు. అలాంటి వారినుండి మనల్ని మనం కాపాడుకోవడం అవసరం. అందుకని ఎప్పుడూ చేసేపనిని గోప్యంగా ఉంచాలి తద్వారా అవరోధాలను అధిగమించగలుగుతాము.
ముఖ్యంగా శత్రువులు మనపై ఒక కన్నేసి ఉంచుతారు. వారి గూఢచారులు మనల్ని అనుక్షణం గమనిస్తుంటారు. అందుకనే చేసే పనిని కాని ఆలోచనను కాని ఎవ్వరితోనూ పంచుకోరాదు. అవసరం అయితే తప్పుడు సంకేతాలు ఎప్పటికప్పుడు ఇస్తుండాలి. అంతేకాదు, ఎప్పటికప్పుడు అవే నిజమైనవిగా రహస్యంగా ప్రచారం కల్పించాలి. అందరినీ నమ్మించాలి.
పరిస్థితులు అంతర్గత శత్రువులతో విషవలయంగా ఏర్పడిన ఆలోచనలతో కలిస్తే అవి ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తాయి. ఆ సమస్యలను శత్రువులు మరింతగా జ్వలింప వ్యవహరిస్తూ సమస్యలను అధిగమించాలి. బృందంతో కలసి ఆలోచించడం, వారితో కలసి పనిచేయడం, వారికి ప్రేరణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తూ వారిలో అమితమైన ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించగలుగుతాము.

ఏ పనినైనా ఆరంభించి పూర్తి చేయాలన్నా దృఢమైన సంకల్పం కలగాలి… అది నిలవాలి. అది ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది. దానినే దార్శనికత (Vision) లేదా లక్ష్యం (Goal) అందాము. ఆ ప్రత్యేకమైన పనిని నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన బృందాన్ని (Mission) తయారు చేసుకుంటాము. అలాగే బృందంలోని సభ్యులనందరినీ కలసికట్టుగా (Integrate) ఆ లక్ష్యంవైపు నడిపించే సామర్ధ్యం నాయకత్వం అంటాము. నిజానికి ఏం చేస్తామన్నది లక్ష్యం (Mission) కాగా ఎందుకు చేస్తామనేది దార్శనికత (Vision). విలువలతో ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం వల్ల విజయ సాధకులమౌతాము…
దానితో రాజ్యము లేదా సంస్థ పురోగతిని సాధిస్తుంది.. కలసి సంపదను సృష్టించగలుగుతాము. ఆ సంపదను అందరితో పంచుకోగలుగుతాము. దానివల్ల రాజ్యం లేదా సంస్థ శ్రేయస్సును, అభ్యుదయాన్ని పొందగలుగుతుంది. అయితే ఇక్కడే ఒక అడ్డంకి ఉంటుంది. మన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవైనా బృందంలోని వ్యక్తుల మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తే అది కార్యనిర్వహణలో అడ్డంకులు సృష్టిస్తుంది. అందుకనే అవసరమైన గోప్యతను అన్ని విభాగాలలోనూ పాటించాలి.
నిజాయితీ ఉండాలి కాని అతి నిజాయితీగా ఉండే వ్యక్తులు పలు సమస్యలు ఎదుర్కొంటారు. అలాగని నిజాయితీకి దూరంగా ఉండమనీ కాదు. అంతర్గతంగా నిజాయితీని కలిగియుండి పైకి మాత్రం అవసరమైన మేరకు మాత్రమే ప్రదర్శించాలి. మన భావాలు స్పష్టంగా తెలపడం మంచిదే కాని ఆ తెలిపే విధానాన్ని ఇతరులకు బాధ కలిగించకుండా తెలియచేయడం నేర్చుకోవాలి. నటన జీవితంలో భాగం కావాలి కాని నటనే జీవితం కాకుండా జాగ్రత్తపడాలి.
ప్రతి వ్యక్తీ అభ్యుదయాన్ని కాంక్షిస్తాడు. అభ్యుదయం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. వ్యక్తిగతంగా లేదా సంస్థాగతంగా లేదా రాజకీయంగా లేదా దేశప్రగతి పరంగా నిర్ణీత కాలవ్యవధిలో తాము చేరుకోవాలని అనుకున్న స్థానాన్ని, దానినే లక్ష్యాలు అనుకుంటే, వాటిని సాధించిన భావనతో స్పష్టంగా దర్శించడమే Vision. Vision అని ఎందుకంటున్నాను.. అంటే.. దేనిని ఎంత స్పష్టంగా ఎంత దగ్గరగా దర్శించగలమో దానితో లేదా ఆ ఫలితంతో సంబంధం అంతగా బలోపేతమౌతుంది. దానిని సాధించేందుకు అవసరమైన ప్రేరణను అంతర్మనస్సు ఇస్తుంది.
మన పరిమితులకు ఆవల భవితను చూడగలిగిన సామర్ధ్యమే దార్శనికత Vision. ప్రస్తుతం అది సాకారంగా లేకపోవచ్చు కాని సాధించగలమనే నమ్మకంతో, ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికతో వచ్చే 5 లేక 10 లేక ఆపై సంవత్సరాల పిమ్మట తమ /తమ సంస్థ/ దేశ భవిత ఎలా ఉండాలో ఊహించుకోవడం Vision… తదుపరి కాలంలో అది సాకారమూ కావచ్చు.. కాకపోనూవచ్చు. అది మన ప్రయత్నంపై, నిర్వహణా సామర్ధ్యంపై, దేశకాల పరిస్థితుల మార్పుపై, మారుతున్న సాంకేతిక రాజకీయ ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. మార్పునకు అనుగుణంగా మన Vision మారితే సాకారమయ్యే అవకాశాలు హెచ్చు. (సాంకేతికత నేపథ్యంలో మారుతున్న పెద్ద కాలానికి వచ్చే మార్పులు ఊహించడం, దానికి తగిన ప్రణాళికలు రచించుకోవడం సమంజసమా కాదా అనేది మరొక చర్చ…)
దర్శించిన భవితను సాకారం చేసుకునే క్రమంలో… అవసరమైన బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం, వారిని తాము దర్శించిన మార్గంవైపు, తమ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా కలసికట్టుగా నడిపించడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేసుకోవడం, అందులో ఎవరికి ఏయే బాధ్యతలు, అధికారాలు అవసరమో వారికి ఆయా బాధ్యతలతో కూడిన అధికారాలు అప్పగిస్తూ అన్ని విభాగాలను పర్యవేక్షించే విధానాన్ని స్పష్టపరచే ఆలోచనా సరళి Mission.
ఈ రెంటిని సాధించే క్రమంలో ఉపకరించేవి విలువలు (Values)… క్రొత్తదనాన్ని ఆవిష్కరించడం, అనుమోదించడం, అవసరమైన చోట దానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం, వైవిధ్యంగా ఆలోచించడం, అందరినీ కలుపుకుపోయే తత్త్వం, సామాజిక బాధ్యతను కలిగి ఉండటం… అన్నింటికిమించి విశ్వసనీయత… ఇవి విలువలుగా పరిగణించబడతాయి. ఇక్కడ క్రొత్తదనాన్ని ఆవిష్కరించడం అంటే… Visionను సాధించే క్రమంలో పరిస్థితులతో రాజీపడటం కాదు. సాధించే క్రమంలో ఎదురయ్యే అవరోధాలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలను కనుగొనడం మాత్రమే.
కణిక నీతిని అనుసరించి Dhritarastra పాండవులను ఇంద్రప్రస్థానికి పంపేందుకు సంకల్పించిన సందర్భంలో వారి వసతికై అక్కడ లక్క ఇంటిని నిర్మింపచేశాడు. అందులో వారిని కాల్చేయాలనే లక్ష్యం కౌరవులది. చాలా జాగ్రత్తగా వ్యూహాన్ని రచించారు. నమ్మకస్థులతో దానిని అమలు చేయించారు. పాండవులు అక్కడికి వెళుతున్నందుకు బాధను నటించారు. కాని ఆ వ్యూహాన్ని కనిపెట్టిన విదురుని Vision ఆ వ్యూహాన్ని భగ్నం చేసింది. పాండవులు రక్షితులయ్యారు. పాండవులు ద్రుపదుని బంధుత్వంతో బలోపేతులయ్యేంత వరకు వారి ఉనికిని రహస్యంగా ఉంచుకున్నారు. విదురుని వ్యూహం గోప్యంగా ఉంచబడటంవల్ల ఆ వ్యూహం సాకారమయింది. కౌరవ వ్యూహం భగ్నం అయింది.
మిగితాది పార్ట్ 4 లో…