Vidura Niti—Life Principles Still Relevant: Part- 2
Vidura Niti—Life Principles Still Relevant: Part- 2 సమత్వమే వికాసం, మంచి లక్షణాలు లేకుంటే?, మనోవ్యాధికి మందు…?
విపరీతతరశ్చ త్వం భాగధేయేన సంమతః అర్చిషాం ప్రక్షయాచ్చైవ, ధర్మాత్మా ధర్మ కోవిదః! ఓ ధృతరాష్ట్రా! నీవు ఒక పెడసరపు కర్ర లాంటివాడవు. పుట్టుకతో గ్రుడ్డివైన నిన్ను ప్రజలు రాజుగా అంగీకరించలేదు. అయినా భీష్ముడు, పాండురాజు కారణంగా నీవు . పాలకుని స్థానంలో కూర్చున్నావు. నీవు ధర్మాత్ముడవు, ధర్మము తెలిసినవాడవు… అయినా, నీలో మంచి లక్షణములు ఏవీ లేని కారణంగా ఎవరూ నిన్ను రాజుగా అంగీకరించడం లేదు అంటున్నాడు Vidura. Dhritarastra ఇప్పుడు శత్రువుగా భావిస్తున్న ధర్మరాజులో ఉన్న మంచి లక్షణాలలో ఒక్కటి కూడా తనలో లేని కారణంగా అతను అందరిచే ద్వేషింపబడుతున్నాడు. అలాగే అతనిని వ్యంగ్యంగా, వెక్కిరింతగా ధర్మాత్మా, ధర్మకోవిదా అంటున్నాడు Vidura.
జాత్యంధువే అయినా Dhritarastra ధర్మం తెలిసిన వాడు, విజ్ఞాని. ప్రజ్ఞాచక్షువు. అయినా తనలోని రాజ్యకాంక్ష, పుత్రవాత్సల్యం కారణంగా తమ్ముని కుమారులకు అన్యాయం చేస్తున్నాడు. ఒక నాయకుడు తన పరివారాన్ని అంతటినీ సమదృష్టితో చూడాలి. అంతేకాదు.. ప్రతిభను గుర్తించాలి, దానికి ప్రోత్సాహం ఇవ్వాలి. పాండవులు బలపరాక్రమాలను గుర్తించి, ప్రశంసించి వారి సామర్ధ్యాన్ని సామ్రాజ్య సుస్థిరతకు ప్రగతికి ఉపయోగించుకోవలసిన వాడు, వారిని ద్వేషించడం కారణంగా, బలవంతులైన వారితో కలిగిన శత్రుత్వం వల్ల అతనిలో కలిగిన చాంచల్యత అతని విపరీత మానసిక స్థితికి కారణమైంది.
ఈనాడు కూడా మనలో ఎందరమో ఆత్మీయులతో కలిగిన కొద్దిపాటి అసౌకర్యానికి, విపరీత పరిణామాలకు అసహనానికి గురై బంధుత్వాలకు దూరం అవుతున్నాము, జీవితాలను బాధామయం చేసుకుంటున్నాము. దానికి కారణాలను విశ్లేషిస్తే…
1. తమ గురించి తమకు తెలిసింది తక్కువ కావడం లేదా మన బలాబలాలను సరిగా అంచనా వేసుకోలేకపోవడం.
2. భయం.. పరిస్థితుల పట్ల పరిణామాల పట్ల కలిగే భయం. నిజానికి దానిని అధిగమించే అవకాశాలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం.
3. అహంభావం.. తమను గూర్చి తాము అతిగా ఊహించుకోవడం వల్ల కలిగిన ఆధిక్య భావన…సమాజంలో “నేనూ” అనే భావనను పెంచుకోవడం నాయకుని లక్షణం. కాని సమాజంలో “నేనే” అనే భావన పెంచుకోవడం, తద్వారా ప్రత్యేకతను కోరుకోవడం వల్ల తెలిసీ తెలియక “అహంభావం” వెలుగుచూస్తుంది. అంతేవాసుల పొగడ్తల వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల అది పెరిగిపోతుంది.
4. తాను, తనవారు కేంద్రంగా పరిమిత వృత్తంపై ప్రేమానురాగాలను, అనుబంధాలను అతిగా పెంచుకోవడం. అలాగే, మన ఆత్మీయులు మనకన్నా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితే మనలో కలిగే న్యూనతాభావనల వల్ల వారి పట్ల ఈర్ష్యాసూయ భావనలు పెరగడం…
5. బుద్ధి ఆధిపత్యం వహించాల్సిన స్థానంలో మనస్సు ఆధిపత్యం వహించడం. ద్వారా ఏర్పరచుకున్న పూర్వ నిశ్చితాభిప్రాయాలను అనుసరించి మంచి చెడ్డలను నిర్ణయించుకోవడం, వ్యక్తులను ఆదరించడం…
నిజానికి ఈ అయిదూ ఒక విషపూరితమైన వృత్తం లాంటివి. ఒకదానిని మరొకటి పెంచి పోషిస్తుంటాయి. జరిగే, జరగబోయే నష్టాన్ని పట్టించుకోవు లేదా తక్కువగా అంచనా వేస్తాయి. వచ్చే ఫలితం కన్నా జరిగే నష్టం తక్కువ అనే అభిప్రాయాన్ని పెంచి తమ ఆధిపత్యాన్ని మనసుపై ప్రభావవంతంగా ముద్రిస్తాయి. జీవితం పట్ల అవగాహనా రాహిత్యం వల్ల లేదా పరిమితమైన అవగాహన వల్ల పరిస్థితుల పట్ల అనుక్షణం భయం పెరుగుతుంది. బావిలోని కప్పలవలె అవగాహన పరిమితమై పరిధులు దాటి చూసేందుకు అనుమతించదు. ఆత్మ పరిశీలనకు అనుమతించదు. ఇలాంటివారు ఉన్నతమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తూ “బ్రతకవచ్చు” కాని సమున్నత వికాసంతో “జీవించలేరు”. అంటున్నాడు Vidura

సంపదను పెంచుకోవడం, అధికారంలో కొనసాగడం లక్ష్యాలుగా ఎంతటి నీచానికైనా దిగజారడం ఇలాంటి వ్యక్తుల పట్ల చూడవచ్చు. ఇలాంటి వారిలో “బృందం” అనే మాటకు తామే అనే భావన తప్ప అందరినీ కలుపుకుపోయే ఆలోచన ఉండదు, వచ్చినా నిలవదు. వీరు చూసేది స్పర్ధపూరిత విధానాన్నే గాని సహకార మనస్తత్వాన్ని ఆదరించలేరు. జీవితం పట్ల అవగాహనారాహిత్యం భయానికి దారితీస్తుంది.
ప్రతి విషయాన్ని అనుమానించడం, ఎవరినీ నమ్మకపోవడం, ప్రతిదానిలో ప్రమాదాన్ని ఊహించడం వల్ల ప్రతి నిర్ణయం తాత్కాలిక ప్రయోజనాలకనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. దూరదృష్టి కరవవడం వల్ల క్రొత్తదనాన్ని నిరసించడం అలవడుతుంది. ఏ పని చేయాలన్నా అది అసాధ్యమైనదనే భావన సృజనశీలతను చంపేస్తుంది. ఒకవేళ అపజయం పాలయితే…? ఈ ప్రశ్న సదా వెన్నాడటం వల్ల నియమిత మార్గాన్ని విడిచిపోయేందుకు అవసరమైన సన్నద్ధత పెంచుతుంది.
అహంభావం కోరుకునే ప్రత్యేకత వల్ల ఆశించిన దానికి అతుక్కుపోతాము. అంతర్గతమైన భయాన్ని కప్పిపుచ్చుకోవడాని చేసే ప్రయత్నం “అహంభావాన్ని” అది వ్యక్తుల పట్ల ఆరాధన కావచ్చు, జాతిపట్ల ప్రేమ గౌరవాలు కావచ్చు, కోరుకునే ఫలితాల పట్ల మమకారం కావచ్చు… వాటి బంధనాలలో చిక్కుకుపోతాము. ఇతరులకు ఎందుకు సహాయం చేయాలనే భావన వల్ల మన విజ్ఞానం, సంపదను ఇతరులతో పంచుకునేందుకు ఇష్టపడము. అహంభావం అమితంగా పెరిగి మనసును నడిపిస్తుంది. మన మాట వినని మనసు వల్ల వివేచనా, విచక్షణా భరితమైన బుద్ధిపై పొరలు క్రమ్మి పొరలచే కప్పబడి అధికారాన్ని నెరపడం వల్ల సమాజంలో మనపై ద్వేషభావన ఏర్పడి తాత్కాలిక ప్రయోజనాలు లక్ష్యంగా సాగుతుంది. కన్ను; మన్నును, మిన్నును గానని పెరిగిపోతుంది. దానివల్ల జీవితం పట్ల అవగాహనా పరిధిని విస్తరించుకోవడం క్లిష్టతరమౌతుంది. అహంభావన వల్ల పరిమిత భావనలకు అతుక్కుపోతాము.
నేను నా వారు అంటూ వ్యక్తులకు, నాది అంటూ సంపదకు, నేనే ఉన్నతమైన ఫలితాలను సాధిస్తాననే భావనతో ఫలితాలకు అతుక్కుపోయి పరిమిత చట్రంలో బంధీలవుతాము. ఆ చట్రం వెలుపలి జీవితం రసమయమని ఎవరైనా చెప్పినా వినే స్థితికి దూరమవుతాము. ఇదివరకు సాధించిన ఫలితాలే ప్రేరణగా గొప్పలు చెప్పుకునే మానసికస్థితి కలుగుతుందే కాని దానిని దాటి ముందుకు చూసే వికాసం లభింపదు. భూతభవిష్యత్తులకు అతుక్కుపోయి వర్తమానాన్ని గాలికి వదిలేసే వ్యక్తిత్వం అలవడుతుంది.
అతిగా అనుబంధాలను, పూర్వనిశ్చితాభిప్రాయాలను పెంచుకోవడం వల్ల ఆ భావనల వలయంలో బంధీ అయిన మనస్సు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. సత్యాన్ని గమనించనీయదు. హితుల మాటలను వినదు. అంతరాత్మ ఎప్పటికప్పుడు మంచి చెడ్డలను వివరించినా దాని నోరు నొక్కేస్తూ తన మార్గంలోనే ప్రయాణిస్తుంది. తనలోకి ప్రవహించే సలహాలనే గంగా ప్రవాహ మార్గాలను అన్నింటినీ మూసివేసి తాను కాపలా ఉంటూ తనకు “నచ్చే” ఆలోచనలను మాత్రమే అనుమతిస్తుంది… తద్వారా విపరీత ఫలితాలు కనిపిస్తున్నా పట్టించుకోకుండా తన మార్గంలో సాగమంటుంది అంటున్నాడు Vidura
ఇలాంటి విషవలయ మనో భూమికలో చిక్కుకున్న వాడు Dhritarastra. తనకు ధర్మాధర్మ వివేచన ఉన్నది. కాని దానిని పుత్రవాత్సల్యత మ్రింగివేసింది. సంజయ రాయబార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే వ్యగ్రత వల్ల తనకు నిద్ర పట్టడంలేదు. ఆ ఆందోళన నుండి ఉపశమింపచేసే మాటలు కావాలి.. కాబట్టి Vidura ని పిలిపించుకున్నాడు.
If There Are No Good Qualities? మంచి లక్షణాలు లేకుంటే… ?
“ఆత్మ జ్ఞానం సమారంభ స్తితిక్షా ధర్మ నిత్యతా, యమర్థా న్నాపకర్షని స వై పండిత ఉచ్యతే” నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే, అనాస్తికః శ్రద్ధధాన ఏతత్ పండిత లక్షణమ్!
ఆత్మజ్ఞానము, కార్యములందు శక్తి, వైరాగ్యము, ధర్మమును ఎడబాయకుండుట అనునవి పురుషార్థములు వాటి నుండి ఎవనిని దూరముగా తొలగింపవో అతడు పండితుడు, అలాగే… మైలైన వానిని చేయుట, కీడులను చేయకుండుట, నాస్తికత్వము లేకుండుట, శ్రద్ధ కలిగియుండుటలు అంటాడు Vidura. “కూడా పండితుని లక్షణాలు తము దారెరుగుట, వేగ పడమి, దాలిమి, విడుపు గలుగుటయు లేని ప్రభు త్వము, గలదె? వారి యందీసుమానుషము లొకడుఁ బట్టి జూడం గలడే?
తమ శక్తియుక్తులు తాము తెలుసుకొనడం తొందరపడకపోవడం, ఓర్పు, దానగుణం అనే ఈ ఉదాత్త లక్షణాలు లేనటువంటి ప్రభుత్వం నిలుస్తుందా? వారి యందు అంటే… దుర్యోధనునికి మంత్రాంగం చెప్పే కర్ణ శకుని దుశ్శాసనుల యందు ఈ మంచి లక్షణాలలో (సుమానుషములు) ఒక్కటైన ఒక్కరైనా చూడగలరా? అంటున్నాడు Vidura… ధృతరాష్ట్రుని తో.
ప్రభుత్వం అంటే సకల కార్యాలను ఏక కాలంలో సమర్ధవంతంగా నిర్వహింపగలిగిన శక్తి. తమను తాము తెలుసుకోవడం… చేసే పనిలో స్పష్టత ఉండాలి… అది ఆత్మ విమర్శ ద్వారానే సాధ్యపడుతుంది. తమను తాము ఎరుగుట) తము దారెరుగుట… ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే తామెక్కడ ఉన్నారో తెలియాలి.. ఎక్కడకు వెళ్ళాలో తెలియాలి, ఎందుకు వెళ్ళాలో తెలియాలి.. మరీ ముఖ్యంగా అక్కడకు వెళ్లి ఏం చేయాలో తెలియాలి… వేగపడమి… తొందరపాటు లేకపోవడం… మాటలో తొందరపాటు ఆత్మీయులను దూరం చేస్తుంది… తొందరపాటు నిర్ణయాలు అనర్ధాన్ని కలిగిస్తాయి. ఆలోచించి, విషయాన్ని సమగ్రంగా విశ్లేషించి పనిని ఆరంభించాలి. కడదాకా కొనసాగించాలి…. తాలిమి… సహనం…. ఫలితం వచ్చేదాకా ఓర్పు ఉండాలి. విడుపు గలుగుట… పట్టు విడుపులు తెలియడం… ముఖ్యంగా ఎక్కడ తగ్గాలో తెలియడం… దేని కోసం దేనిని విడవాలో తెలియడం… స్వప్రయోజనమా.. సంస్థ ప్రయోజనమా… సామాజిక ప్రయోజనమా… ఏది ముఖ్యం… స్పష్టత ఉండాలి. అదే ప్రభుత్వం నడిపే విధానం.. సంస్థను నడిపే విధానం… అది తెలిసిన వాడు పండు… పండితుడు ఆ లక్షణాలను ఆచరణలో పెడితే సుమానుషము… తెలిసి పెట్టకపోతే అమానుషము..
జీవితం అనే నాణానికి రెండు పార్శ్వాలుంటాయి.. మొదటిది… జీవితంలోని వివిధ అంశాలలో మరియు అభ్యుదయంలో మన భాగస్వామ్యం ఎలా ఉన్నదనేది. అదే చరిత్రలో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది, ఉన్నతీకరించబడుతుంది. రెండవ అంతం… సాధించాలనే తీవ్రమైన కోరిక లేదా తృష్ణ, ఏర్పరచుకున్న బంధాలు, గీసుకున్న పరిధులు, అహంభావాదులు… ఈ విషవలయంలో చిక్కుకోవడం వల్ల సాధన అనేది వెనుకకుపోతుంది. ఈ రెంటినీ ఎలా నిర్వహించుకుంటున్నామనేది మన జీవితాన్ని శాసిస్తుంది.
ఏదైనా సాధించాలనే తపన కలిగిన వ్యక్తి… భావోద్వేగాలకు బంధీ అయి, తీవ్రమైన తృష్ణ మాత్రమే కలిగి, జీవితం పట్ల సకారాత్మక దృక్పథం లేకుండా… అవగాహనతో కూడిన చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకోకుండా… ఏదీ సాధించ లేడు. తన సామర్ధ్యానికి తగిన విజయాన్ని ఎన్నడూ సాధించలేడు. వీరిలో తనను తాను తెలుసుకునే నేర్పు ఉండదు… తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, ఓర్పు ఉండదు, అసూయాద్వేషాలకు బంధీలయి ఉంటారు. దాన భావనను ప్రచారానికి ఉపయోగిస్తాడే కాని దానం అంటే త్యాగభావన లేదా పంచుకోవాలనే ఆలోచన మృగ్యమౌతుంది. వీరి జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది… ఆశాసౌధాలలో, ఊహల గాలి లాగా అలాగే… మేడలలో విహరిస్తూ… పరాన్న భుక్కులుగా, ఇతరులపై ఆధారపడి జీవించే వారిగా మిగిలిపోతారు..
కొందరు జీవితంపై అనురక్తితో ప్రతి అంశంలో భాగస్వాములౌతూ.. సంబంధిత విషవలయంలో చిక్కుకుపోతారు. వీరిలో భౌతిక జీవితంలో అభివృద్ధి ఉంటుంది కాని వీరి ఆలోచనలు పైపైన సాగుతాయే కాని లోతుగా ఏ విషయాన్ని విచారించేందుకు సిద్ధపడవు. ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఇష్టపడరు. తమ జీవిత గమ్యం ఏమిటి… దానిని సాధించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అనే అంశంపై కనీస అవగాహనను పెంచుకోరు. జీవితమంతా ఒక Rat race పరుగెడుతుంటారే కాని ఆ Rat ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. అంతర్గత కోరికలకు అతుక్కుపోయి అంతంలేని, అర్థంలేని కోరికల వెంట పరుగులు దీయడం జరుగుతుందే కాని ఎక్కడ ఆగాలో ఎందుకు ఆగాలో తెలియని స్థితిలో కూరుకుపోతారు. మనలో చాలా మందిమి ఈ మానసిక స్థితిలోనే ఉంటాము. కొందరు జీవిత ప్రయోజనాన్ని గుర్తిస్తారు… కోరికల విషవలయానికి దూరంగా నిలిచే ప్రయత్నం చేస్తారు.
జీవితాన్ని ఉపకరణంగా భావించి జీవిత ప్రయోజనాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. బంధాలను గుర్తిస్తారే కాని దానికి అతుక్కుపోరు. కర్తవ్యం నిర్వహణలో నిష్ఠ కనపరచినా ఫలితానికి అతుక్కుపోవడం జరగదు. వీరిలో అంతర్గత ఎదుగుదల అపరిమితమౌతుంది. పక్షపాత రహితంగా ఉండేందుకు, సమగ్రతను సాధించేందుకు ఇష్టపడతారు… జీవితమంతా ఆ ప్రయత్నంలో శ్రమిస్తారు. కొందరు జీవితాన్ని సాధనా పర్వంగా తీసుకొని తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తూ… ఏ ఫలితాన్ని ఆశించకుండా… ఏ ఫలితానికీ బంధీ కాకుండా. అనుక్షణం జీవితాన్ని ఆస్వాదిస్తూ… జీవితాన్ని రసమయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. వీరికి ప్రక్రియ… బాధ్యత… సమాజ శ్రేయస్సులు అత్యంత ప్రాధాన్యతాంశాలు. వీరి మార్గదర్శన ప్రపంచానికి దిక్సూచి లాంటిది. వీరి మార్గదర్శన సమగ్రమై ప్రపంచాభ్యుదయానికి మార్గం చూపుతుంది. వీరి జీవితం సచ్ఛీలం ప్రాతిపదికగా పవిత్రత, సమగ్రతలపై ఆధారపడి ముందుకు సాగుతూ జగదాదర్శమౌతుంది.
ఈ నాలుగు విభాగాలను గమనించినప్పుడు తమ శక్తియుక్తులు తాను తెలుసుకొనడం, తొందరపడకపోవడం, ఓర్పు, దానగుణం అనే ఈ ఉదాత్త లక్షణాలు కలిగిన వ్యక్తుల జీవితాలు ఆదర్శప్రాయాలయి మార్గదర్శన చేస్తాయి. ఇవి లేని వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాలకై శ్రమిస్తారు, అప్పుడప్పుడు తామాశించిన ఫలితాలను సాధించనూవచ్చు కాని ఎవరికీ వారు ఆదర్శప్రాయంగా నిలువలేరు. ఈ లక్షణాలను గలిగిన వారు పాండవులు, లేని వారు కౌరవులుగా చెపుతూ Vidura… దుష్టచతుష్టయం వల్ల కార్యసాఫల్యత కలగదని చెపుతున్నాడు అంటున్నాడు Vidura
ఈనాటి వ్యాపారరంగంలో రెండు విధాలయిన విధానాలను చూడవచ్చు. ఒకటి వ్యాపారవేత్తలు, రెండవ తెగ పారిశ్రామికవేత్తలు. ఇరువురూ చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తారు… లాభాలనార్జిస్తారు.. దేశాభ్యుదయానికి దోహదపడతారు. కాని వారి వ్యవహారసరళిలో భేదం ఉంటుంది. టాటా కంపనీ లాంటి వ్యవస్థల నిర్వహణా శైలిని చూసినప్పుడు… కొన్ని ముఖ్యమైన అంశాలు గమనిస్తాము. వారి ఆలోచనలో సమగ్రత ఉంటుంది… తొందరపాటు ఉండదు. వాటి బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు వీటిపట్ల సమగ్రమైన అవగాహన ఉంటుంది. ఫలితాలు వచ్చేదాక వేచి చూసే ఓర్పు, ఓపికా ఉంటుంది. అవసరమైన సమయంలో దేశ సమగ్రతకూ, భద్రతకు ఉపయోగపడుతుంది అనుకుంటే తమ సంపదనెంతైనా త్యాగం చేసే దానగుణమూ కంపనీ సంస్కృతిగా నిలిచి ఉన్నది.
బాగా లాభాలనార్జించిన ఎన్నో వ్యాపారసంస్థలలో ఆ దానగుణం కనిపించదు. మేలు చేకూర్చే పనులు చేయడం, కీడు చేకూర్చే పనులు చేయకపోవడం, శ్రద్ధ కలిగి ఉండటం, నాస్తికత్వం లేకుండుట… ఈ లక్షణాలు కూడా వ్యాపారవేత్తలు సంతరించుకోవలసిన లక్షణాలు. మేలు చేకూర్చడం అంటే సంస్థకు, సంస్థకై పనిచేసే ఉద్యోగులకు, ఆ ఉత్పత్తులు వాడే వినియోగదారులకు, సమాజానికి ఏవి శ్రేయస్సును ఇస్తాయో వాటిని చేయాలి అంటే వాటినే ఉత్పత్తి చేయాలి, అమ్మకాలు చేయాలి. అలాంటి సంస్కృతిని కలిగిన సంస్థలు ఇతరులకు కీడును చేయవు. సత్సంస్కృతి ఉత్పత్తిగా, డబ్బు సంపాదించడం “సహ ఉత్పత్తి”గా ముందుకు సాగే వ్యాపారం ఉన్నతమైనది, ఉదాత్తమైనది. అక్కర ఆసక్తి కలిగినది శ్రద్ధ అనబడుతుంది.
ఒక రైతుకు వ్యవసాయంలో సహకరించే పనిముట్లను తయారు చేయడం “అక్కర”. ఆసక్తితో దానిని పారిశ్రామికవేత్త తయారు చేయడం శ్రద్ధ. ఈ శ్రద్ధ వల్ల వ్యాపారమూ వృద్ధి అవుతుంది. వియోగదారుని అవసరాలూ తీరుతాయి. ఒక సంస్థలో… వ్యక్తుల మధ్య వైవిధ్యభరితమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ఆ వైవిధ్యం సంఘర్షణకు ఒక్కొక్కసారి దారితీయవచ్చు. కాని ఆ భావ స్పర్ధ వ్యక్తులను అగౌరవపరచే స్థాయికి చేరకూడదు. అలా చేరడం నాస్తికత్వంగా చెప్పుకోవాలి. ఈ నాస్తికతకు దేవుడు లేడనే నాస్తికతకు సంబంధం లేదు.
A cure for mental illness…? మనోవ్యాధికి మందు…? విదురుని మాటలో…
జాగ్రతో దహ్యమానస్య శ్రేయో యదునుపశ్యసి తద్రూహి త్వం హి నస్తాత ధర్మార్థ కుశలో హ్యసి! Vidura ! నీవు ధర్మార్థములు బాగుగా తెలిసిన వాడివి. నాకు నిద్రలేదు ఒడలు కాలిపోతున్నది… ఈ పరిస్థితులలో నాకేది యుక్తమో, శ్రేయమో చూసి బోధ చేయుము అని Dhritarastra అడగడం… దానికి… Vidura ఈ క్రింది విధంగా చెపుతున్నాడు.
రాజా! నీ ముఖము వివర్ణంగా కనిపిస్తున్నది. మనసులోని చింతా విషాదాలను వ్యక్తీకరించే ఉపకరణం ముఖం. నీకు నిద్రపట్టకపోవడం నీ సమస్య. అది నీ అంతర్గతమైనది. అంతర్గతమైన సమస్యకు బాహిరమైన పరిష్కారాలు ఎప్పుడూ పని చేయవు. దానికి మూలం నీకు తెలుసు, పరిష్కారమూ నీకు తెలుసు… అంతరంగ సమస్యకు పరిష్కారం అంతరంగంలోనే వెతుక్కోవలసిందే. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించేంతవరకు ఏదో ఒక విధంగా బ్రతుకుతారు.. కొందరే జీవిస్తారు. వారే చుట్టూ ఉండే సమాజాన్ని పరివర్తన దిశలో నడిపిస్తారు. వారి జీవితమే అర్థవంతమై, విజయవంతమై పలువురికి ఆదర్శప్రాయమౌతుంది. వారే నిజమైన నాయకులుగా చరిత్రలో నిలుస్తారు. సాధారణ ప్రజానీకం జాతిని ఎలా నిర్మూలింపచేయవచ్చో ఆ మార్గాన్ని చూపగలుగుతుంది.. కాని జాతి నిర్మాణానికి మార్గదర్శకులై నడిపించే వారు కొద్ది మందే ఉంటారు.. వారే ప్రపంచంలో జీవించగలుగుతారు. నిజానికి పగ సాధింపని రాజు, ఇల్లు వదలని బ్రాహ్మణుడు ఇరువురూ అసమర్ధులుగా పరిగణించబడతారు.
పుట్టడమే ఒక ప్రయోజనాన్ని ఆశ్రయించి జరుగుతుంది. జీవితం ఆనందంగా బ్రతికేందుకు మాత్రమే కాదు. గౌరవప్రదమైన, దయాపూర్ణమైన, ప్రయోజనభరితమైన జీవితాన్ని ఆస్వాదించేందుకు ఉద్దేశించబడింది. మన జీవితం ప్రపంచంపై ఒక బలమైన ముద్రను వేయగలగాలి. అలాంటి జీవితానికి ప్రాతిపదిక “నైతికత”. ఏం చేయాలన్నది విజ్ఞానం చెపుతుంది. ఆ “చేయడం” మన నైతికతపై ఆధారపడి ఉంటుంది. ఆ నైతిక జీవితం విలువలపై ఆధారపడి ఉంటుంది. విలువలతో కూడిన నైతికత అంతరంగ వికసనపై ఆధారపడింది.
నిజానికి అందరూ నైతిక జీవితాన్ని అభిలషించే వారే కాని దానిపై స్వార్థం అనే ముసుగువేసుకొని నైతిక విలువలకు దూరమవుతున్నాము. ఆ ముసుగును తొలగించుకునేందుకు బలమైన సంకల్పంతో బాటుగా ఆచరణ కూడా ముఖ్యమైనదే. దానికి ప్రాతిపదిక పరస్పర సహజ అంగీకృతి. అదే జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలను దూరం చేసి జీవితాన్ని సార్ధకం చేస్తుంది… ప్రయోజనం సాక్షాత్కరిస్తుంది. ప్రయోజనాన్ని గుర్తిస్తే జీవితం రసభరితమౌతుంది. ప్రయోజనాన్ని గుర్తించలేని సమయంలో అది సంఘర్షణా భరితమౌతుంది. అంటాడు Vidura
ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం: గృహాలలో వాడుకునే Inverterను చూడండి.. అది సాధారణ సమయాలలో ఛార్జ్ అవుతూ ఉంటుంది.. విద్యుత్ పోయిన సమయంలో తాను పనిచేస్తుంది… అలాగే సాధారణ సమయాలలో సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తులు క్లిష్టసమయాలలో తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించి సమాజానికి బలాన్ని చేకూరుస్తారు.
మహారాజా! ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి.. ఘోషయాత్ర సమయంలో మీరు నమ్ముకున్న కర్ణాదులు ఓడి పారిపోయిన వేళ కౌరవులను సైన్యాన్ని రక్షించింది పాండవులే కదా. దానికి వారికి కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉన్నది. కృతజ్ఞత అంటే.. చేసిన సహాయాన్ని అది ఎవరు చేసినా ఎంత చిన్నదైనా దానిని “గుర్తించడం” (Recognising), “జ్ఞాపకం పెట్టుకోవడం” (Remembering), “తిరిగి వారికి/ ఇతరులకు సహాయ పడటం” (Reciprocating)… మనఃస్పూర్తిగా ఎవరైతే కృతజ్ఞతలను తెలుపగలరో వారి హృదయం నిర్మలంగా ఉంటుంది.
అంతేకాదు, పాండవ బలం తక్కువగా ఉన్నదనే భావనతో కౌరవులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కాని, శోధించడం లేదా అన్వేషించడం, విశ్లేషించుకోవడం, సాకారం చేసుకోవడం అనే వరసక్రమం విజయానికి దారి చూపుతుంది. దానికి బృందయత్నం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఆ బృందానికి ప్రేరణ, సంస్కృతి, సృజనాత్మకత, పరస్పర సహకారం, నిరంతరం నేర్చుకోవడం, ఆధునిక సాంకేతిక విషయాలను అన్వయించుకోవడం, నాయకత్వం వహించడం అనే ఏడు ప్రాధమిక లక్షణాలు అవసరమౌతాయి. ఆ లక్షణాలు పాండవ బలంలో కనిపిస్తున్నాయి… మీ బలంలో ఆ సమన్వయత లోపం కనిపిస్తుంది. ఆ సమన్వయత లేమి వల్ల అనేకత్వం, తద్వారా విజయావకాశాలు తగ్గడం జరుగుతుంది. అంటాడు Vidura
కృష్ణుడు ద్రష్ట… ఉత్తేజకారకుడు… పాండవులకు విజయసారథియై నడిపిస్తున్నాడు.. ఆ నైపుణ్యాలు కౌరవులలో ఎందరిలో ఉన్నాయో నిజాయితీగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. “మనుర్భవ” మనిషికా అంటుంది వేదం. మానవత్వాన్ని సంతరించుకుంటేనే మనిషిగా వ్యవహరింపబడతారు. మానవత్వం మనుషులను కలుపుతుందే కాని విభజించదు. పాండవులు నీకు పరాయివారు కారు. వారిని ఆదరించదగిన మానసిక పరివర్తనను సంతరించుకోవలసిన అవసరం కౌరవులకు ఉన్నది. పరివర్తన మనుషులను బాధల నుండి ఆనందానికి తీసుకువెళ్ళాలి. బంధనాల నుండి విముక్తికి దారి చూపాలి… క్రూరత్వం నుండి దయ, ప్రేమ లాంటి ఉన్నతస్థితి వైపు నడిపించాలి. రాజా! నీలాంటి ప్రజ్ఞాచక్షువులు, శాంతిసామరస్యాలను సాధించేందుకు, వాటిని తోటివారితో పంచుకునేందుకు దారులు చూస్తారు.. అదే అజ్ఞులు, ఉద్రేక స్వభావులు ఎన్నడూ శాంతిని సాధించలేరు, పంచలేరు.. ఆలోచించి నిర్ణయం తీసుకో.
సరైన పనులు చేయడం (Effectiveness), పనులను సరిగా చేయడం (Efficiency) ఈ రెండూ ముఖ్యమైనవే. ఒకటి సమర్ధతకు నిదర్శనం కాగా రెండవది దక్షతకు ప్రతీక అనుకోవచ్చు. యుద్ధంలో విజయాన్ని సాధించాలన్నా, శాంతిని సాధించి ప్రజల మనసులను గెలవాలన్నా ఈ రెండింటిలోనూ ప్రయత్నం అవసరమే.. కొద్ది ప్రయత్నం… వల్ల ఎక్కువ ఫలితం సాధిస్తే అది దక్షతగా చెప్పుకోవచ్చు. అంతర్గత సామర్ధ్యం క్రియాశీలమైనప్పుడు ఫలితం వస్తుంది. సాధించిన ఫలితం మనపై మనకు నమ్మకాన్నిస్తే అది సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇది ఒక వృత్తంలాగా క్రియాశీలతలో ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అంటాడు Vidura
ఏ కోరికలూ లేకుండా ఉండటం అనేది సాధ్యపడదు. అయితే ఆ కోరికలను శుభ్రపరచుకోవడం మాత్రం సాధ్యమే. అదే విజ్ఞత… స్వార్థానికై అధికారాన్ని దుర్వినియోగం చేయడం అవినీతిగా పరిగణించబడుతుంది. వివేకహీనులైన వారి సంపదలు స్థిరంగా ఉండవు. పరిస్థితులు చేజారి యుద్ధవాతావరణం నెలకొన్న తరుణంలో సంధి/ శాంతి ప్రయత్నాలు ఫలిస్తాయా అనే అనుమానం వద్దు. ప్రయత్నం చేయకపోతే సంపదలు సమకూరవు. ప్రయత్నస్వభావి ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా సమర్ధవంతంగా సాధించగలడు. పాండవులకు రాజ్యభాగాన్ని ఇవ్వక, వారితో వైరం వల్ల నీవు కోరుకుంటున్నది ఏమిటి… దానిపై స్పష్టతను దర్శించు. ఒకరితో ఒకరు “కలిస్తే” అది ద్విగుణీకృతమౌతుంది. ఒకరితో మరొకరి వైరం వల్ల మరొకరు మీ స్థానంలో ఉంటారు….ఆలోచించు.
రాజా! కోరుకున్నది సాధించడం విజయం కాగా కన్న కలలను సాకారం చేసుకోవడం దానిని సంతృప్తితో కూడిన గర్వాన్ని పొందడం ఉత్తమమైన విజయంగా చెప్పుకోవచ్చు. ఆశయాన్ని సాధించడం ఉత్తమ, ఉన్నత విజయానికి బాట వేస్తుంది. విలువలతో కూడిన స్థిరత్వం (సాధించిన విజయాన్ని నిలుపుకోవడం), నాణ్యత (తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని సాధించడం), వేగము (బద్దకాన్ని, వాయిదావేసే లక్షణాన్ని జయించడం), అంతర్గత యోగ్యతను, సామర్ధ్యాన్ని పెంచే సాధనాలుగా గుర్తించాలి. యువత ఈ మాటలను మర్వరాదు.అంటాడు Vidura
బాధ్యతాయుత అంకితభావనతో పనిచేయడం, జీవన నిర్వహణా కేంద్రంగా; ఆశలు అనుక్రియలు వృత్త అంచులలో లేదా ఆవరణ హద్దులలో ఉండటం వల్ల మరియు సాధించగలమన్న నమ్మకం కేంద్రంగా; అనుమానాలు వృత్త అంచులలో ఉండటం వల్ల సంతృప్తితో కూడిన విజయం సాధించగలుగుతాము. అవే సాధనకు, సృజనాత్మక ఆలోచనలకు మూలాలుగా నిలుస్తాయి. కౌరవులు “ఆశయాన్ని” కాక “ఆశ” ప్రాతిపదికగా సాధించాలనుకుంటున్నారు. అది అసంతృప్తికి దారితీస్తుంది.
ఇరు వర్గాలకూ కావలసిన వాడివి.. నీవు వారికి శాంతిస్థాపన యొక్క ఆవశ్యకతను చక్కగా వివరించు, అవసరమైన ప్రేరణనివ్వు, ఒక పెద్దవానిగా వారిని అక్కున చేర్చుకొని వారి భావాలను పంచుకో, ప్రోత్సహించు, ఒక గురువుగా మార్గాన్ని చూపించు…. యుద్ధానలాన్ని ఆర్పే ప్రయత్నం చేయి, అంటాడు Vidura.
మిగితాది పార్ట్ 3 లో…