The Everlasting Significance of Vidura’s Knowledge Part-7
The Everlasting Significance of Vidura’s Knowledge: కుటుంబం కోసం వ్యక్తిగత సౌఖ్యాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశం కోసం గ్రామాన్ని తన కోసం భూమి నంతటినీ వదులుకోవాలని చెపుతారు. ఆపదలు కలుగు వేళకై ధనము దాచిపెట్టుకొని దానిని రక్షించుకోవాలి. ఆ ధనాన్ని మొత్తం వ్యయించియైనా భార్యను రక్షించుకోవాలి. తనకు అవసరమైనవేళ ఈ రెంటినీ తనకై ఉపయోగించుకోవాలి. రాజా! ఆనాడు జూదము వల్ల ప్రమాదమని… నవ్వులాటకు కూడా జూదమాడరాదని చెప్పాను. పూర్వం ఎందరో చక్రవర్తులు జూదవ్యసనంతో రాజ్యాలు కోల్పోయారనీ చెప్పాను. మీరెవరూ వినలేదు. రోగికి “మేలుచేయు మందు ఇష్టం కానట్లే నా మాటలు మీకు రుచించలేదు.
ఎదుటి వారి బలాబలాలు తెలియకుండా కయ్యానికి కాలుదువ్వుతున్నారు. సింహాలను పారద్రోలి నక్కలను ఒడిలో పెట్టుకున్నట్లుగా అసమర్థుల బలాన్ని నమ్మి బలవంతులైన పాండవులతో యుద్ధానికి నీ కొడుకు సన్నద్ధుడయ్యాడు. వానికి నీవూ వత్తాసుపలుకుతున్నావు. కాకుల సైన్యంతో నెమళ్ళను ఓడించడం సాధ్యపడుతుందా? సింహం నాయకత్వంలో కుందేళ్ల సైన్యమైనా విజయం సాధిస్తుంది. అదే కుందేలు నాయకత్వంలో సింహాల సైన్యమైనా ఓడిపోతుంది. నీవు నీ కొడుకు ఆదరిస్తున్న కర్ణాదులు ఎన్నడూ పాండవులను జయించలేరు.
యజమాని మేలు కోరుతూ, యజమానిని చక్కగా సేవిస్తూ ఉండే సేవకుని ఆదరంగా చూడాలి. ఆ ప్రేమను ఆస్వాదించిన సేవకులు (ఉద్యోగులు) యజమానిని విశ్వసిస్తారు. పాండవులు ఇంకా నిన్ను నమ్ముతున్నారు. వారిని నిరాదరణ చేయకు. అంతేకాదు, సేవకుల పొట్టలు కొట్టి ఇతరుల ధనమును మ్రింగాలనుకోవడం సమంజసం కాదు. ఆ వంచన తెలిస్తే.. ఎంత ఆత్మీయులైనా నిన్ను నమ్మరు.. నీ మంత్రులు కూడా నిన్ను విడిచివేసి నీకు పగవారిగా మారిపోతారు ఆలోచించు. నాయకునిగా అందరికీ ఆదర్శప్రాయుడవై ఉండవలసిన నీవే స్వార్థ ప్రయోజనాలకై యుద్ధాన్ని తద్వారా అశాంతినీ ఆహ్వానించడం, సాధారణ జనానికి ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు.
రాజ! కాలంలో మానవ జీవన కాలపరిమితి చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో కక్షలు కార్పణ్యాలు జీవితానికి శోభనీయవు. జీవితాన్ని నాణ్యమైన జీవనంగా దిద్దుకోవలసిన అవసరం ఉంది. వివిధ పార్శ్వాలలో సాగే జీవితాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాము లేదా మలుచుకుంటున్నామనేది మన జీవన నాణ్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఆటుపోటులు సహజమైన జీవనయానంలో అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగే వారే శ్రేయస్సును పొందగలుగుతారు.
ఎలాగైతే ఒకే స్థాయిలో పాడితే ఆ పాట ఎంత గొప్పదైనా వినసొంపుగా ఉండదో, ఒకే రంగు వాడి చిత్రించిన చిత్రం అందంగా కనిపించదో, ఒకే వంటకంతో చేసిన భోజనం విందు భోజనం అనిపించుకోదో అలాగే జీవితంలోని అన్ని పార్వాలను సమర్ధవంతంగా నిర్వహించుకుంటేనే రసమయం జీవితం ఆవిష్కృతమౌతుంది. ప్రపంచమే మంచిచెడుల సంయోగం. దీనిని గుర్తించడం, అంగీకరించడం అందులోని మంచిని జీవితానికి అన్వయించుకోవడం, ఉన్నతమైన జీవన నిర్వహణకు దర్పణంగా నిలుస్తుంది.
“సుఖప్రాప్తి, దుఃఖనివృత్తి ఏవ అస్మాకం ప్రవృత్తి” అన్న విధానంలో నీ కొడుకు ఆలోచిస్తున్నాడు. సుఖాలపై కోరిక, దుఃఖాలు బాధలు రావద్దనే భావన… ఈ రెండే తమ ప్రవృత్తిగా ఉన్న నీ సంతానం… వారి చుట్టూ ఉన్న కోటరి వల్ల ప్రపంచ శాంతి భగ్నమయ్యే పరిస్థితి వచ్చింది. రాజ! మంచో చెడ్డ ఇప్పటివరకు నీ కొడుకు మాట విన్నావు. అతడు దుర్మార్గులు చూపుతున్న ఎండమావుల వలయంలో, భ్రమలో మునిగితేలుతున్నాడు. ఇప్పటికైనా వారిని కాదని నిర్ణయం తీసుకో. ప్రపంచశాంతిని నిలిపినవాడవవుతావు. ఆలోచించు… ఆత్మవిమర్శ చేసుకో…
జీవితంలో నావైఖరి; నన్ను నేను ఉద్ధరించుకునేందుకు గానీ నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరించేందుకు కానీ ఉపయుక్తమౌతుందా?నా జీవితం పట్లనే నేర్పరుచుకున్న నమ్మకాలు బలమైనవా లేక బలహీనమైనవా? వాటి పరిమితులను అవగాహన చేసుకున్నానా… అవసరమైన వేళ, అవసరమైన మేరకు వాటిని సంస్కరించుకోగలనా? నేను నా జీవన లక్ష్యాన్ని సాధించడంలో అంకిత భావనతో ఉన్నానా? లేదా ప్రతిక్షణం నా వైఫల్యాలకు ఎవరినైనా బాధ్యులను చేయడమో లేదా పరిస్థితులను కారణాలుగా చూపడమో చేస్తున్నానా? నా విజ్ఞానాన్ని, నా అవగాహనను, ఆలోచనాపరిధిని పెంచుకునేందుకు… అవసరమైన చోట పరిమితులకు, పరిధులకు అతీతంగా చూడగలుగుతున్నానా? ఈ కోణంలో రాజా ఆలోచించు.. విస్తృతమైన పరిధిలో లోక కల్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని స్వార్థాన్ని త్యాగం చేస్తేనే “నాయకుని”గా నిలుస్తావు…రాజా
Problems are solutions … సమస్యలే పరిష్కారాలు…
విద్యామదో ధనమద స్తృతీయో అభిజనో మదః, మదా ఏతే౨వలిప్తానా మేత ఏవ సతాం దమాః! ధనమును, విద్యయు, వంశం బును దుర్మతులకు మదంబుఁ బొనరించును, స జ్జనులైన వారికడఁకువ యును వినయము నివియ తెచ్చు సుర్వీనాథా! పొగరెక్కిన వానికి చదువు ధనము వంశము మరింత మదమెక్కిస్తాయి. ఇవియే సజ్జనులకు గౌరవాదరణలను పెంచుతాయి. రాజా! ధనమూ విద్య మంచి వంశమూ అనేవి బుద్ధి చెడిన వారికి మదాన్ని కలిగిస్తాయి. ఇవే బుద్ధిమంతులకు వినయవిధేయతలను చేకూరుస్తాయి.
విద్య, ధనము, వంశము వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించాలి. అవి గర్వాన్ని తెచ్చిపెడితే అతడు మదమాత్సర్యాలకులోనై పతనావస్థకు చేరే అవకాశం ఉన్నది. అందుకని వ్యక్తిలో శీల నిర్మాణం జరగాలి. చెరువు గట్టును పటిష్టంగా నిర్మాణం చేస్తే దానిలోకి చేరిన నీరు త్రాగునీరుగా సాగునీరుగా ప్రజలకు ఉపయుక్తమౌతుంది. అలాకాని నాడు… చెరువులోనికి కొద్ది నీరు వచ్చినా ఉప్పొంగిపోయి పొలాలను నాశనం చేస్తుంది… జనపదాలనూ నాశనం చేస్తుంది.
హేతుబద్ధమైన ఆలోచనలు మంచివే… అవి అవసరం కూడా.. కాని ఆ తార్కికమైన, హేతుబద్ధమైన ఆలోచనలూ ఆచరణాత్మకం కాని నాడు లేదా ఆచరణలో పెట్టని నాడు ఉపయుక్తం కావు… వ్యక్తి ప్రగతికి మార్గం చూపవు. మనలో అవసరమైన జ్ఞానము ఉన్నది.. ఆర్ధిక వనరులు ఉన్నాయి… మంచి మార్కెట్టూ ఉన్నది.. ఫలితాలు బాగున్నాయి.. ప్రగతిపూర్ణ వాతావరణంలో చేస్తున్న వ్యాపారం… అహంకారాన్నిస్తే… వినియోగదారులను, ఉద్యోగులను, సరఫరా దారులను పట్టించుకోకుంటే వ్యాపారం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది.
అదే అహకారం లేని వ్యక్తి మునిగిపోతున్న నావ లాంటి వ్యాపారాన్ని గట్టున పడవేయగలడు. సముద్రం కల్లోలితమై ఉన్నది… మనం ఉన్న నావ మునిగిపోతున్నది.. ఆ సమయంలో మనమేలా ప్రవర్తిస్తామన్నదే మన జీవితాన్ని నిర్వచిస్తుంది. మన స్థాయికి దర్పణంగా నిలుస్తుంది. ఆ ప్రవర్తనయే నిర్ణయాత్మకమైనది.. కీలకమైనది. సాధారణంగా విపత్కర పరిస్థితులు అందరినీ ఒకటిగా చేయాలి కాని వ్యక్తులలో ఆ విజ్ఞత కొఱవడితే… అందరూ కుక్కలు చింపిన విస్తరి ముక్కలౌతారు.ఇక్కడ ధృతరాష్ట్రునికి పాండవులు బలంపై భయం ఉన్నది.. కౌరవబలంపై భరోసా ఉన్నది… కౌరవులపై ప్రేమ ఉన్నది. తన నిర్ణయం కీలకమైనది. ఎందరికో అది జీవన్మరణ సమస్య. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అతను నిర్ణయించుకోలేకపోతున్నాడు.చెపుతున్నాడు విదురుడు.
నిర్ణయం తీసుకోలేని ఆందోళనా స్థితియే అతని డోలాయమాన పరిస్థితికి కారణం. అదే సత్య అనేది అన్ని తరగతులకూ అతీతమైనది. తర్కాన్ని ప్రక్కన పెట్టి బాధ్యతలను అర్ధం చేసుకోవాలి… నిజానికి బాధ్యత తీసుకోవడమన్నది… భగవంతుని తత్త్వం. అందరినీ ఒక్క తాటిపై నడపగలననే నమ్మకమే ఆ తత్త్వాన్ని తెలుసుకోగలిగిన సూత్రం. విత్తుముందా.. చెట్టు ముందా… అనే విచికిత్స తర్కం.. వైవిధ్యభరితమైన ఎన్ని . వాదనలు వినిపించినా ఎన్ని మార్గాలను ప్రతిపాదించినా అది ఏనాటికీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపలేదు. నిజానికి ఇందులో ఏదీ ముందుకాదు. మొదట్లో ఈ రెండూ అత్యున్నత చైతన్యస్థితిలో ఒక్కటిగానే ఉన్నాయి. దీనిని అంగీకరిస్తే.. ఎన్నో వాదాలు, ప్రతివాదనలు, వివాదాలు సమసిపోతాయి. కాని మనలోని అహంభావం, దృష్టికోణం, “నేనే” అనే ప్రత్యేకతను కోరుకునే స్వభావం దానిని అనుమోదించనీయదు.
ఆత్మపరిశీలన వల్ల అంతరదృష్టి ఏర్పడుతుంది. అంతరదృష్టి వల్ల భౌతిక పరిమితులకు అతీతంగా దర్శించగలుగుతాము. విత్తుముందా చెట్టుముందా అన్నట్లుగానే.. సమస్యలు పరిష్కారాలు ఒకదానితో మరియొకటి కలసి ఉంటాయి. అవి జీవన విధానంలో అంతర్భాగాలు.. విడదీయరానివి. సమస్య ఉన్న ప్రతిచోటా పరిష్కారం ఉంటుంది.. పరిష్కారం ఉన్నది అంటే అక్కడ సమస్య ఉన్నట్లే. ఒక సమస్యను పరిష్కరిస్తే అక్కడ ఆ పరిష్కారం మరొక సమస్యను సృష్టిస్తుంది.. సమస్యలేని పరిష్కారం, పరిష్కారం లేని సమస్యా ఉండవు. నిజానికి ఈ రెండూ ఒకదానిని విడిచి మరొకటి ఉండదు. ఒక నాణానికి రెండూ, రెండు ముఖాల లాంటివి. ఎలాగైతే ప్రపంచంలో భగవంతుడూ, భగవంతునిలో ఈ విశ్వం ఉన్నదో అలాగే సమస్యలో పరిష్కారమూ, పరిష్కారములో సమస్యా ఉన్నాయి. తార్కిక దృష్టితోకాక అంతరదృష్టితో పరిశీలిస్తే.. సమస్యా-పరిష్కారాల ఏకత్వం బోధపడుతుంది.

ధృతరాష్ట్ర మహారాజా! శత్రువులపై గెలుపు, తోటివారిపై ఆధిపత్యాన్ని సాధించడం ఉన్నతమైనవే కాని యదార్ధాన్ని గ్రహించడం అన్నింటి కన్నా సమున్నతమైనది. అది కాలం, ప్రేమ, సత్యం, బాధ్యత మరియు విశ్వాసం లాంటి పలు అంశాలను ప్రభావితం చేసే అంశం. దాని వల్ల భౌతిక, భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక పార్శ్వాలలో వ్యక్తి పరిణతి, పరిమితులకు అతీతంగా వెలుగు చూస్తుంది. కౌరవ పాండవుల మధ్య ఉన్న స్పర్ధ సహకార | స ఒకరి పాటవాన్ని మరొకరు పెంచుకునేందుకు ఉపయోగపడితే, వారి స్పర్ధ బాధ్యతాయుత సమన్వయంతో కూడిన సహకారంగా ఇరువురి మధ్య సౌహార్ద్రతాభరిత పోటీతత్త్వంగా వెలుగుచూస్తుంది. సహకారంతో కూడిన స్పర్ధ, స్పర్ధతో కూడిన సహకారం వల్ల ఇరు వర్గాలలోని ప్రతిభాపాటవాలు కలిగిన నాయకుల అత్యున్నత శక్తిసామర్ధ్యాలను వినియోగించుకునే విధానానికి ఉపకరిస్తుంది. ఇటు సంస్థలు బాగవుతాయి.. వినియోగదారునికీ ఉపయోగపడతారు. అలా కాని నాడు, వారి విద్యలు, ధనమూ నిరుపయోగంగా పడి ఉంటాయి… లేదా వినాశనానికి దారిచూపుతాయి.
Darkness cannot be conquered with darkness: చీకటితో చీకటిని జయించలేము:
సంపన్నతర మేవాన్నం దరిద్రా భుంజితే సదా, క్షుత్ స్వాదుతాం జనయతి సా చాధ్యేషు సుదుర్లభా! దరిద్రులు ఎల్ల వేళలా రుచిగల అన్నమే తింటారు.. ఆకలియే వారికి రుచిని పుట్టిస్తుంది. శ్రీమంతులకు ఆకలి పుట్టుట మిక్కిలి కష్టము. సాధారణంగా వారికి తినాలనే ఆశ తప్ప తినుటకు శక్తియే ఉండదు. దరిద్రులకు కడుపులో కట్టెలైనను జీర్ణమగును.
ఏది ఉన్నా, ఎంత ఉన్నా లేకపోయినా అందరూ ఏదో భయానికి లోనవుతూనే ఉంటారు. ఏదీ లేనివారికి బ్రతుకుతెరువు ఎలా అన్నది భయము.. సరిపోయేంతగా ఉన్నవారికి చావు భయము ఉంటుంది. ఇక బాగా ధనవంతులకు సంపదను రక్షించుకోవడం ఒక భయము, అవమానాల పాలవుతామో ఏమో అనే భయము మరొకటి… ఇలా భయమనేది నిరంతరం ప్రజలనందరినీ వేదిస్తూనే ఉంటుంది.
త్రాగుడు వల్ల మదము పెరుగుతుంది కాని, దానికన్నా ఐశ్వర్యమదం చాలా పెద్దది. అన్ని చెడు ఆలోచనలకు ఆ మదమే మూలమౌతుంది. కౌరవులు రాజ్యలోభము మదంచేత గ్రుడ్డివారై ఉన్నారు. వారి మనస్సును వారు గెలవలేని పరిస్థితులలో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయారు. తమ మనస్సులపై తమకు ఆధిపత్యం లేకపోవడం కారణంగా వారికి మంత్రాంగాన్ని చెప్పవలసిన మంత్రులపై వీరికి ఆధిపత్యం లేదు. మంత్రులను నియంత్రించ లేని వారికి శత్రువులను నియంత్రించ గలిగిన సామర్థ్యం ఎలా వస్తుంది.
ఇసుకలో తలదాచుకునే ఊష్ట్రపక్షి లోకాన్ని చూడనట్లుగా నీ కుమారులు రాబోయే ప్రమాదాన్ని చూడలేకపోతున్నారు. చీకటిని చీకటి ద్వారా జయించలేము. చీకటిని తరిమివేయాలి అంటే వెలుగు కావాలి. అలాగే ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. ద్వేషాన్ని జయించాలంటే మన హృదయం ప్రేమతో పరిప్లుతం కావాలి. ఇతరుల పట్ల సానుభూతితో నిండిన అభిమానం పొంగిపొర్లాలి. కానీ దుర్యోధనుని మనస్సు పాండవుల పట్ల ద్వేషాగ్నితో రగిలిపోతున్నది. అది శాంతించేందుకు మార్గాన్వేషణ కావాలి. కర్ణాదులు ఆవేశాగ్నిని ఎగదోస్తున్నారు. దానితో అతడు తన మనస్సుపై పట్టుకోల్పోయాడు. నేర్చిన విద్య రాజకీయాల నేపథ్యంలో అంగడి సరుకయిందే కాని ఆత్మోద్ధరణకు ఉపయుక్తం కావడం లేదు. నిజానికి ఆత్మోద్ధరణ కోసం, సమాజ హితం కోసం పరితపిస్తూ ఆ దిశలో శ్రమించే వ్యక్తిత్వమే పరిపూర్ణత్వాన్ని సాధించగలదు. చేసే పనిలో గొప్పదనాన్ని, విశిష్టతను ఎవరు చెప్పాలి.
ప్రయోజనాన్ని లేదా ఫలితాన్ని పొందేవారు లేదా భాగస్వాములైన వారు మాత్రమే సాధ్యాసాధ్యాలను చర్చించి అందులోని సారాన్ని సమాజానికి ఉపయుక్తమయ్యే చెప్పాలి. ఆ పని యొక్క ఉదాత్తతను ప్రచారం చేసినవారు పని మంచిచెడ్డలను విధంగా మలచగలిగిన వారు ఆ పనిలోని గొప్పదనాన్ని నిర్ణయించాలి. అంతేకాని ఆ పనితో ఏ విధమైన సంబంధం లేనివారు ఆ పని యొక్క బాగోగులను నిర్ణయించడం విడ్డూరంగా ఉన్నది. పాండవులతో యుద్దం అనేది పాలకుల ఆత్మాభిమానానికి, ఆధిపత్య ధోరణికి సంబంధించిన సమస్యగా చూస్తున్నామే కాని నిజానికది ప్రజల సమస్యయే. దానివల్ల కలిగే పరిణామాలు ప్రజలే అనుభవిస్తారు. కాబట్టి ఆ సమస్యను ప్రజలతో చర్చించాలి.
యుద్ధం లాంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రజలతో చర్చించి ప్రజల నిర్ణయానుసారంగా నడవవలసిన రాజ్యాంగంలో ప్రజల ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగి పోతున్నాయి. పాలకుల ఈర్ష్యాసూయలు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నాయి. అలాగే విద్యావ్యాప్తి జరగవలసిన రంగంలో బోధన ప్రధానమా నేర్చుకోవడం ప్రధానమా అన్న చర్చలో బోధనకన్నా నేర్చుకోవడమే ప్రధానమన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. నేర్చుకోవడం అనే ప్రక్రియలో బోధన అనేది ఒక ఉపకరణం మాత్రమే అనే వాస్తవం గుర్తించడం లేదు. ఆ ప్రక్రియ యొక్క ఫలితమే ఈనాటి ఈ సమస్య.
నిర్ణయాధికారం ఉన్న పాలకులు మాత్సర్యంతో గ్రుడ్డివారయ్యారు. వారిని శాసించే అధికారం కలిగిన పెద్దలు, విజ్ఞానులు నిర్లిప్తతతో ఉదాసీనంగా ఉన్నారు. దుర్మార్గుల దౌర్జన్యానికన్నా మంచివారి ఉదాసీనత ప్రమాదకరం. పాలకులకు పాలనలో మార్గదర్శన చేయవలసిన యంత్రాంగం పొగరుబోతులై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తమ గొంతు వినిపించి, నిర్ణయాన్ని శాసించాల్సిన జన సామాన్యానికి అధికారాన్ని చేరే అవకాశం లేదు. మంచిచెడులు ధైర్యంగా బోధించాల్సిన పెద్దరికం, మౌనాన్ని ఆశ్రయించింది. సలహాలు సూచనలు ఇవ్వవలసిన వ్యవస్థ అధికారాన్ని ఆశ్రయించింది. ఈ పరిస్థితులలో మంచిచెడ్డలు అనుభవించేవారికి తెలిసే అవకాశం లేకుండాపోయింది. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాన్ని నడపాల్సిన రాజ్యాధికారం తమ ఇష్టాయిష్టాలకు బంధీయై అన్యాయాన్ని అందలమెక్కించాలని ఆరాటపడుతుంది.
రాజా! కపటత్వం, చెడుబుద్ధి, హృదయం లేని మెదడు, సానుభూతి లేని స్వభావం, సుఖశాంతులను, ధర్మాన్ని సహించలేని మనస్తత్వం, అసూయా ద్వేషాలను, వైరాన్ని రెచ్చగొట్టే దుర్గుణం, హితం చెప్పటానికి సమ్మతించని వ్యక్తిత్వం, ఎత్తులు, శ్రీ పైఎత్తులు వేస్తూ ఎదుటివారి జీవితాలతో ఆడుకునే చాతుర్యం, మాయలు పన్నడంలో నైపుణ్యం… కలిగిన శకుని లాంటి వారు దుర్యోధనుని మంత్రాంగంలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నారు. అంతేకాదు, దుర్మార్గుడు, మూర్ఖుడైన అన్నను గుడ్డిగా అనుసరించి, చేయకూడని పనులలో చెయ్యిగలిపి, మానవ ధర్మాన్ని మంట కలుపుతున్న దుశ్శాసనుని లాంటి వారు చక్రం త్రిప్పుతూ ఆత్మీయులయ్యారు.
ఇలాంటి వ్యక్తులు తమ తెలివితేటలు చెడువైపుకు ఉపయోగిస్తున్నారే కాని మంచికి వినియోగించడం లేదు. ఈ పాత్రలెప్పుడూ చిరంజీవులే. మానవత్వపు విలువలు అడుగంటి, స్వార్ధబుద్ధులు ప్రబలుతున్న ఈ రోజులలో అన్ని రంగాలలో ఈ వ్యక్తిత్వం కనిపిస్తూనే ఉన్నది. అసూయాద్వేషాలపట్ల అప్రమత్తంగా ఉండకపోతే సమాజ జీవితంలో సుఖశాంతులు లోపిస్తాయి.
రాజా! పాపము చేయు వారిని సామాజికంగా దూరం పెట్టాలి… కాని నీ పుత్రవాత్సల్యత వారిని దగ్గరగా నిలుపుతుంది. దానివల్ల పాపము చేయని వారికి కూడా దాని వల్ల వచ్చే శిక్ష తగులుతున్నది. ఇది వారితో కలిసి ఉన్నందుకు దోషము. ఎండిన కర్రతో కలిసి ఉన్న తడిసిన కర్ర కూడా దానితో కలసి ఉన్న దోషానికి కాలిపోతుంది. నీ విజ్ఞతను, అధికారాన్ని ఉపయోగించి పాండవులను పిలిపించి సంధి చేయడం ఉత్తమోత్తమం… దానితో సుఖశాంతులు నిలుస్తాయి, అంటున్నాడు. విదురుడు.
A wrong decision leads to hell… తగని నిర్ణయంతో తప్పదు నరకం… రాజా !
దక్కెను రాజ్యమంచు నకటా యిటు దమ్ముని భాగ మీక నీ కంచె దది యెట్లరుగున్? విను మీను లోలతన్ గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన చాడ్పు సూవె, యి ట్లుక్కువుడైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడ గూడునే! రాజా! మాయాజూదంలో రాజ్యం దక్కింది గదా అని తమ్ముని పాలు ఈయక ఆ రాజ్యాన్ని నీవు ఒక్కడివే అనుభవిద్దామనుకోవడం ధర్మమా? అలా అనుభవించినా ఆ రాజ్య భోజనం అరుగుతుందా?

రాజా! చేప మాంసపు రుచికై ఆశపడి, కడుపు కక్కుర్తితో గాలాన్ని మ్రించినట్లే మీరీ రాజ్య లోభము చేత భాగమును ఇవ్వమనుకోవడం కాదా… కుమారుడు మోసగాడు… వాడు ఆడించినట్లు నీవు ఆడవచ్చునా… ఆలోచించమంటున్నాడు విదురుడు. ఏ సమాజంలోనైనా నాయకుడు సకాలంలో తీసుకునే నిర్ణయమే అతని/ అతనిపై ఆధారపడిన వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఘర్షణ/ యుద్ధం వల్ల రెండు వర్గాలు నష్టపోతాయి. జీవితం అన్నాక అనుక్షణం ఏదో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు నీ జీవితాలను నరకప్రాయం చేస్తాయి రాజా!
మన చుట్టూ ఉండే కోటరి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ సరైన సమాచారం ఇచ్చి, ఆ సమాచారాన్ని అన్ని కోణాలలో విశ్లేషించి సరైన సలహాలను ఇచ్చి సహాయపడగల వ్యక్తులను నియమించుకుంటే అభ్యుదయం కలుగుతుంది. మానసిక శాంతి లభిస్తుంది. ఎవరే సలహాలు, సూచనలు చేసినా చివరగా తీసుకునే నిర్ణయం యొక్క ఫలితానుభవం, బాధ్యత తనదే కనుక నాయకుడు పూర్వ నిశ్చితాభిప్రాయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాడు. నాయకుని – ఉదాసీనత, తనవారి పట్ల ఆశ్రితపక్షపాతం, తన క్రింది కార్యనిర్వాహకుల అవినీతి, బాధ్యతారాహిత్యం, అత్యాశ ఇవి సంస్థ/ రాజ్యం నిర్వీర్యం కావడానికి కారణాలు కావచ్చు.
రాజా! నీ కుమారుని చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం నీకు తెలుసు. వారి వైఖరిలో మార్పు వస్తే, పాండవులతో సంధి కుదిరితే రాజ్యం సుభిక్షమవుతుంది. పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. కాని ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈసూయాద్వేషాలతో, పాత పగలతో, పాత ఆలోచనలకు అతుక్కుపోయి… జరగబోయే నష్టాన్ని మీరెవరూ గుర్తించడం లేదు. నిర్ణయాత్మక వ్యక్తుల ఆలోచనలో కలిగే సమూలమైన మార్పు సంస్థ నడకలో/ సంస్కృతిలో ప్రగతికి బీజం వేస్తుంది. అవసరం అయిన పక్షంలో, రైతు కలుపు మొక్కలను ఏరివేసి పంటను రక్షించిన విధంగా మార్పును ఆహ్వానించలేని, నిర్వహణా సామర్థ్యం లేని, నిర్వాహకులను అధికారానికి పూర్తిగా దూరంగా ఉంచడంవల్ల ప్రజామోదం పొందడం సాధ్యపడుతుంది. రాజ్యమూ /సంస్థ అభివృద్ధి పథంలో సాగుతుంది.
రాజా! రాజ్యపాలన ఒక వ్యాపార నిర్వహణ అనుకుంటే.. అందులో డబ్బు సంపాదన. అధికారాన్ని అనుభవించడంకన్నా దానిపై ఆధారపడిన వారి బాగోగులు చూడటం అధిక ప్రాధాన్యతాంశమౌతుంది. రాజా! నీవు ఇదివరకు కొంత నష్టకారకమైన లావాదేవీలు (లాక్షాగృహదహనం, మాయాజూదం, ఘోషయాత్ర, గోగ్రహణం లాంటివి) నిర్వహించావు లేదా వాటిని అనుమోదించావు. ఒక్కొకమారు తక్కువ నష్టంతో బయటపడటం వ్యాపారంలో అత్యంత ప్రాధాన్యతాంశం. ఇప్పుడా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉన్నది. విస్తరిలో ఉన్న భోజనం తినేందుకు యోగ్యమైనది. అది శక్తినిస్తుంది. అదే భోజనం నేలపైబడితే భోజనానికి అయోగ్యం అవుతుంది.. ఆరోగ్యానికి భగ్నకారకమౌతుంది.
ప్రతి సన్నివేశం, ప్రతి వ్యక్తీ మరొకరి జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. దేని స్థానంలో దానిని ఉంచడంవల్ల ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాము. సామర్ధ్యం, అర్హత ప్రాతిపదికన సరైన స్థానంలో/ పదవిలో సరైన వ్యక్తులను నియమించుకున్న నాయకుడు సుఖంగా ఉంటాడు. ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించు. విజ్ఞులైన వారిని సంప్రదించు, సహృదయులతో చర్చించు. ఎదుటివారిని అర్థం చేసుకోవడం ద్వారానే సమస్య పరిష్కృతం అవుతుంది. నీ ఆలోచనాసరళిని మార్చుకో.. బలం, బలగం అన్ని వేళలా సమస్యలను పరిష్కరించలేవు. సామరస్య ధోరణి మాత్రమే శాంతి పూర్ణ సమాజాన్ని ఆవిష్కరిస్తుంది.
తప్పు జరిగితే దానికి ఉన్నత స్థాయిలోని వ్యక్తులు బాధ్యత వహించాలి. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆత్మీయులను దూరం చేసుకోవడం మంచిది కాదు. పాండవులు నీ శ్రేయస్సును కాంక్షించే వారు. వారి స్థానంలో నిన్ను ఊహించుకొని నీ ఆలోచనా సరళిని పరిశీలించు… నిర్ణయం తీసుకో. గాలానికి ఉన్న మాంసపు ముక్కకు ఆశపడి జీవితాన్ని కోల్పేయే చేపలాగా పాండవులను గెలిచి రాజ్యాన్ని సాధించగలననే ఆశతో వంశక్షయాన్ని కోరి తెచ్చుకోకు… అంటూ హితవు పలుకుతాడు విదురుడు.
Listening is not enough… వినడం సరిపోదు…రాజా!
బ్రూహి భూయో మహాబుద్ధే ధర్మార్థ సహితం వచః శ్రుణ్వతో నాస్తి మే తృప్తి ర్విచిత్రాణీహ భాషసే!
ఓ మహామతీ! విదురా! నీవు విచిత్రంగా మాట్లాడుతున్నావు. ధర్మార్ధములతో కూడిన నీ మాటలను ఎంత విన్ననూ తనివి తీరడం లేదు.. వాటిని మరీ మరీ వినాలని కుతూహలంగా ఉన్నది అంటున్నాడు Dhritarastra. నీతి వాక్యాలను ఎన్ని మార్లు విన్ననూ తనివి తీరడం లేదు అంటే అవి వినేందుకే మనసు సన్నద్ధమయినది కాని విన్న వాటిని ఆచరించుటకు మనసు ఇష్టపడడం లేదన్నమాట. విన్న వాటిపై విచారించి ఆచరణాత్మకమైన ప్రణాళికలను తయారు చేసుకొని క్రియారూపంలో తీసుకురావాలి. ధృతరాష్ట్రునిలో ఆ మాటలు ఆచరణవైపు మళ్ళడం లేదు.
అందుకే విదురుడు అంటున్నాడు… రాజా తీర్థములందు అన్నింటా స్నానమాడటం, కుమారులందరియందూ సమాన భావన కలిగి ఉండటం ఈ రెండూ సమానమే.. అలా సమాన మనస్సు కలిగిన వారికి ఐహిక భోగాలు స్వర్గసుఖాలు లభిస్తాయి… ఇక్కడ ధృతరాష్ట్రునికి “రాజ్యలోభము”, “పుత్రవాత్సల్యము” “పేరు ప్రఖ్యాతులపై వ్యామోహం” అనే ఆకలి ఉన్నది. తన మనసును బయట పెట్టకుండా తాను నిరాసక్తుడననీ… తన మాటలు చెల్లుబాటు కావడం లేదనే నెపంతో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నాడు. సమానత్వాన్ని ప్రదర్శించలేని జీవిత విధానం కలిగిన ధృతరాష్ట్రుని నీ మనసును ధర్మం వైపు మళ్ళించాలని భావిస్తున్న విదురుడు… తనశాయశక్తుల ప్రదర్శిస్తున్నాడు. అతనంటాడు…
రాజా! జీవితమనేది ఎప్పుడూ ఎంపికకు సంబంధించినదే. జీవితం మరియు వృత్తి ఈ రెంటి మధ్య సంతులనం సాధించాలి. ఎప్పుడైతే నీ జీవిత ప్రవృత్తికి, నీ వృత్తికి వైరుధ్యం కనిపిస్తుందో లేదా నీ వృత్తి జీవితం అసంతృప్తిని ప్రసాదిస్తున్నప్పుడు అందులో . ఒక దానిని విడవవలసిన అవసరం వస్తుంది. దేనిని విడుస్తామనేది మన ఎంపిక. క్రమశిక్షణాయుత జీవితంలో దార్శనికత, దర్శించిన ఉన్నత పథాన్ని చేర్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికా అవసరం. మన దార్శనికత, దానిని చేరే ప్రణాళిక, ఆచరణలో సాధించే ఫలితాలు..
సమాజానికి ఉపయుక్తం అయ్యే విధంగా చూసుకోవాలి. దీని లక్ష్య నిర్ణయం అనాల్సిన అవసరం లేదు కాని ఇది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి చేరేందుకు మొదటి మెట్టుగా భావించవచ్చు. ఎందుకు అంటే మానసికంగా స్పష్టంగా చూడలేని దానిని ఏనాటికీ సాధించడం సాధ్యపడదు. గమ్యం తెలియని గమనం.. ఫలితాన్ని ఇవ్వదు. ధార్మిక మార్గంలో పాలన చేయవలసిన నాయకుడు స్వార్ధభావనకు గ సంస్థను నిర్వీర్యం చేస్తే తాను ఆర్థికంగా బలపడవచ్చు కాని మూలాలు చెదిరిపోతే సమాజం భ్రష్టుపడుతుంది. మానసిక సంతులత దెబ్బతింటుంది..
రాజా! నీ ఆత్మమూలాలను తెలుసుకోవడంలో ప్రతి క్షణం నీ మానసిక సామర్ధ్యాలను వినియోగించు. మానవుల అంతర్మనస్సు తాము ప్రేమించిన దానిని సాధించే విధంగా మలచబడి ఉన్నది. ఆ మనస్సులో ఉన్న ద్వేషం, పగ, కార్పణ్యం లాంటి అసంగతాలను వడగట్టు… నీ ఉన్నతికి సహకరించే ప్రేమ లాంటి సమున్నత దేవీభావనలపై దృష్టి పెట్టు… కౌరవ పాండవుల మధ్య సయోధ్యను పెంచే విధానాన్ని ఆలోచించు. స్వర్గము నీముందుంటుంది.
కౌరవ పాండవులు సయోధ్యతో నీ సంపదగా ఉంటే, శత్రుదుర్భేద్యమై రాజ్యం ఎలా ఉంటుందో, ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకొని ఆ చిత్రాన్ని నీ మనోఫలకంపై ముద్రించుకో రాజా!. ఆ చిత్రానికి తగ్గ ఆచరణాత్మక ప్రణాళికను రచించుకొని ధర్మవిదులు, విజ్ఞులైన పెద్దలందరితో చర్చించి మనసుపై సకారాత్మకమైన ఒత్తిడి పెరిగేట్లుగా చూసుకో. నీలో బలంగా ముద్రింపబడిన భావనలకన్నా నీ ముందున్నది లేదా పైపైకి నీవు చెపుతున్నది ఎప్పుడూ బలమైనది కాదు. కాబట్టి నీవు చెపుతున్న దానినే మనసులో బలోపేతం చేసుకో. ఆ స్పందనలనే ఆహ్వానించు.
నిరంతర అభివృద్ధి కావాలంటే నీ ఆలోచనలు అవసరానుగుణంగా మార్పు చెందుతూ మార్పును ఆహ్వానిస్తూ సాగిపోవాలి. పుత్రవాత్సల్య బంధనంలో ఇమిడి ఉన్నానని భావించకు.. ఈ భూమండలంలో ఏ వ్యక్తీ కూడా బంధనరహితుడై ఉండడు. తన ఆలోచనలపై పట్టు సాధించిన వాడు. మాత్రమే ఆ బంధనాలకు అతీతంగా ఆలోచించ గలుగుతాడు. “నేను నాది” అనే పరిమితులలో ఇప్పుడు బంధీ అయిన మనస్సనే పక్షిని బంధ విముక్తం చేస్తే “మనమూ మనది” అనే ఆకాశం వైపు పయనిస్తుందది. నీ కుమారులకు ప్రమాదం పొంచి ఉన్నదనే భయం నిన్ను వెంటాడినంత కాలం… జీవితాన్ని గెలవడం నీకు అసాధ్యం. నీవు ప్రజ్ఞా చక్షువువు. నీలో ఉన్న విజ్ఞానం శక్తివంతమైనది. దాని అభివ్యక్తికి ద్వారాలు తెరిచిపెట్టు రాజా!
రాజా! నీకు తెలియని విషయాలు నేనేమీ చెప్పడం లేదు.. నీవు అధ్యయనం చేయని క్రొత్త అంశాలూ లేవు. నీ విజ్ఞానం లేదా నా మాటలు నీలో నిక్షిప్తమైన వివేచనను, వికాసాన్ని వ్యక్తం చేసేందుకు ఉపకరణాలు మాత్రమే. నీలోని ప్రేమాభిమానాలను వెలుగు చూడనివ్వు. నీ నిర్ణయం మంచిదయితే నీలో ఆనందం పరిఢవిల్లుతుంది… భయాందోళనలు ప్రక్కకు తప్పుకుంటాయి. అనుభవం పైన మంచి నిర్ణయాలు వెలుగుచూస్తాయి. చెడ్డ నిర్ణయం నుండి అనుభవం వస్తుంది.
చర్వితచర్వణం వలే చేసిన తప్పునే చేయడం నీ స్వీయ అవగాహనా రాహిత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వీయ అవగాహన అనే లక్షణమే జంతువుల నుండి మానవులను వేరుచేస్తుంది. నీ తమ్ముని కుమారులకు రాజ్యాన్ని పంచివ్వడం నీకు బాధాకరమే కాని ఆ నీ భావి జీవితంలో అభ్యుదయాన్ని ఇస్తుందనే సంకేతాలనిస్తుంది. అది నీకు శ్రేయస్కరం …. నీకు తెలియదా… ఈ దేహం ఉన్నంత వరకే భార్యాపిల్లలనే బంధాలు. ఈ రోజే యే నీకు చివరి రోజనే భావనను రానివ్వు… రేపు లేదనుకో.. అప్పుడు నీ నిర్ణయం ఎలా? ఉంటుందో ఊహించుకో..రాజా
రాజ్యం లేదా సంస్థ ప్రగతికి… పరిశ్రమ, దయాదాక్షిణ్యాలు, జాలి, కరుణ, నమ్రత, వినయ విధేయతలు, సహనం, ఓర్పు, నిజాయితీ, ధైర్యసాహసాలు దోహదపడతాయి. ఎప్పుడైతే విద్యార్థి సిద్ధంగా ఉంటాడో గురువు అతనిని వెదుక్కుంటూ వస్తాడన్నట్లుగా నీవు నీ ప్రక్కన నిలిచేందుకు నీ తమ్ముని కుమారులు సిద్ధంగా ఉన్నారు. ఓటమి కన్నా ఓడిపోతామనే భయమే ప్రమాదకరం. వారూ నీ కుమారులే అని భావిస్తే ఓడినా గెలిచినా నీకు ఒకటే.
వ్యాకులపాటు, ఆందోళనలో మ్రగ్గేవారు ఎప్పుడూ తమ అశాంతికి ఇతరులను బాధ్యులుగా చెపుతారు. దుర్యోధనాదులను బాధ్యులుగా చెప్పే కారణాలు నీ సమస్యకు సకారాత్మక పరిష్కారాన్ని కనుగొనలేవు. నిబద్దత లేకపోవడమే నీలోని పెద్ద జబ్బు. నీలోని వ్యాకులపాటు, ఆందోళనలను తుడిచివేయి. అదే నీలో ఇదివరకు వెలుగు చూడని ఉత్సాహాన్ని నింపుతుంది. నీకు అనంతమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని జయిస్తుంది.
నీకొక కథ చెపుతాను వినమంటూ.. విదురుడు ఇలా చెపుతున్నాడు. పూర్వం కేశిని అనే అందగత్తె ఉత్తమ వరుడు కావాలని స్వయం వరం ఏర్పాటు చేసుకున్నది. ఆ స్వయంవరానికి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు, బ్రహ్మవేత్తయైన సుధన్వుడు వచ్చారు. వారిరువురి మధ్య ఎవరు గొప్ప అనే అంశంపై వాదోపవాదాలు జరిగి.. ఒక నిర్ణయానికి రాలేని కారణాన… ఇరువురూ ప్రాణాలను ఫణంగా పెట్టి వారిలో ఎవరు గొప్పవారో నిర్ణయించమని ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి.. ప్రహ్లాదా నీవు ధర్మం తెలిసిన వాడవు.. సత్యము మాత్రమే పలుకుతావు కాబట్టి మాలో ఎవరు గొప్ప.. అనే అంశాన్ని నిర్ణయించి చెప్పమని అడుగుతారు.
విరోచనుడు తన కుమారుడే అయినప్పటికీ ప్రహ్లాదుడు, విరోచనునికన్నా సుధన్వుడే గొప్పవాడని ధర్మ నిర్ణయం చేస్తాడు. అనంతరం ఆ సుధన్వుని వేడి తన కుమారుని తిరిగి పొందుతాడు. అలాగే ధృతరాష్ట్ర మహారాజా! భూమి విషయమున అసత్యమాడి, నీ తమ్ముని కుమారులతో హితులతో వైరము కొని తెచ్చుకోవడం సమంజసం కాదు. రాజా చెడు బుద్ధి కలిగిన వాని ప్రక్కన దైవం నిలువదు.. అంటాడు విదురుడు.
మిగితాది పార్ట్ 8 లో…